నేవీ ఆయుధ సామగ్రి డిపో ఏర్పాటుపై సర్వత్రా ఆగ్రహం

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒంటెద్దుపోకడ నిర్ణయాలతో ఇటీవల కాలంలో ఏజెన్సీ గ్రామాల మధ్య నేవి ఆయుధ యుద్ధ సామగ్రి డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక ప్రకటనలు బయటకు రావడంతో ఏజెన్సీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. యుద్ధ సామగ్రి డిపోలను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయొద్దని వంకవారిగూడెం పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 1160 ఎకరాల భూమిలో ఆయుధ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా సర్వేలు సైతం పూర్తి చేయడంతో ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ‘మా భూముల్లో మాకు తెలియకుండా ఆయుధ యుద్ధ సామగ్రి డిపోలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు.. ఏజెన్సీ గ్రామాల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ప్రజాభిప్రాయం, గ్రామ సభ తీర్మానాలు ఉండాలి.. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో పనులు ఎలా చేస్తారు’ అంటూ ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే గ్రామసభలు నిర్వహించి, పిసా కమిటీ తీర్మానాలు చేస్తే తప్ప ముందుకు సాగడానికి వీలులేదు.. కానీ ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి కేంద్రంలోని మోడీ సర్కార్‌, రాష్ట్రంలోని వైసిపి వ్యవహరిస్తున్న తీరుపై అవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా గ్రామ పంచాయతీలో హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు.

పీసా కమిటీ మొత్తం పూర్తి వ్యతిరేకంపాయం శ్రీను, పీసా కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌, మడకవారిగూడెం

మా పంచాయతీలో పిసా కమిటీ తీర్మానాలు, గ్రామ సభ తీర్మానాలు ఏమీ చేయకుండ ఆయుధ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ అధికారులకు ఆదేశాలివ్వడం బాధాకరం. యుద్ధ సామగ్రి డిపోలకు మేమంతా పూర్తి వ్యతిరేకం. మా ప్రమేయం లేకుండా ఆ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చూస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం.

కనీసం గ్రామసభ కూడా పెట్టలేదుకుంజా పార్వతి, వంకవారిగూడెం సర్పంచి

మా గ్రామంలో డిపో ఏర్పాటుపై ఎలాంటి తీర్మానం గానీ, గ్రామసభ గాని ఏర్పాటు చేయలేదు. ఆయుధ సామగ్రి డిపో కూడ మా పంచాయతీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు అధికారిక ప్రకటనల ద్వారా తెలిసింది. డిపోను పంచాయతీ ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

ఇక్కడ డిపో పెట్టడానికి వీల్లేదుమడం శేషగిరిరావు, దాట్లవారిగూడెం

మా పంచాయతీ పరిధిలో నేవి ఆయుధ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ పెట్టనివ్వబోము. మా ప్రమేయం లేకుండా పెట్టాలని చూస్తే మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, డిపో మాత్రం పెట్టనివ్వబోము.

➡️