పండుగకు ధరాఘాతం..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలను సామాన్య ప్రజానీకం సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి కన్పిస్తోంది. నిత్యావసర వస్తువులతోపాటు అన్నిరకాల ధరల పెరుగుదల సామాన్య ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సామాన్యులు ఎక్కువగా జరుపుకునే పండుగ క్రిస్మస్‌, సంక్రాంతి. క్రైస్తవ సోదరులు క్రిస్మస్‌ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని తహతహలాడతారు. ప్రతిఒక్కరూ తమ బంధువులను పండుగకు ఇంటికి పిలుచుకుని ఆనందంగా గడుపుతారు. పిండివంటలు చేసుకోవడంతోపాటు కొత్త బట్టలు పెద్దఎత్తున కొనుగోలు చేస్తారు. అయితే అందనంత ఎత్తుకు అన్నిరకాల ధరలూ పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ఇళ్లలో పండుగ సందడి కానరావడం లేదు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 పలుకుతుండగా, పెసరపప్పు రూ.125, వంటనూనె రూ.120కుపైగా, బెల్లం కిలో రూ.50, మినపప్పు రూ.120 ఇలా అన్ని రకాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. మోడీ సర్కార్‌ వచ్చిన తర్వాత రూ.430 ఉండే గ్యాస్‌ సిలిండర్‌ కాస్తా ప్రస్తుతం రూ.980కు చేరింది. ఏదైనా పిండివంట చేయాలంటే తక్కువగా లెక్కించినా రూ.ఐదు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పిండి వంట చేసేందుకు సామాన్య ప్రజానీకం ముందుకు అడుగువేయలేని దుస్థితి. క్రిస్మస్‌కు కొత్త బట్టలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. గతంలో రూ.500 పలికే బట్టలు ఇప్పుడు రూ.వెయ్యికి చేరాయి. చిన్న పిల్లల దుస్తులైతే మరింత ధర పలుకుతున్నాయి. దీంతో సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ వేళ సామాన్య కుటుంబాలు నిరాశ, నిస్పృహాల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. కుటుంబం అంతా బట్టలు కొనుగోలు చేసుకోకుండా పిల్లల వరకూ కొనుగోలు చేసి చాలా కుటుంబాలు సర్ధుకున్న పరిస్థితి కన్పిస్తోంది. ధరల పెరుగుదలతో పిండివంటలు చేసుకునే అవకాశం లేకపోవడంతో రెఢమేీడ్‌గా తయారుచేసిన పిండివంటలను ఏదో కొద్దిగా కొనుగోలు చేసి కాలం గడిపేస్తున్నారు. బంధువులను సైతం పండుగకు పిలవడం మానేశారు. కుటుంబమంతా బట్టలు కొనుగోలు చేసుకుని, పిండి వంటలు వండుకుని సంతోషంగా జరుపుకోవాలంటే ప్రస్తుత ధరలతో కనీసంగా రూ.20వేలు పైనే ఖర్చవుతోంది. అంత ఖర్చు చేసే పరిస్థితిలో సామాన్య కుటుంబాలు లేవు. కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. కిలో అల్లం రూ.130 పలుకుతుండగా, వంకాయలు కిలో రూ.64, క్యారెట్‌ కిలో రూ.60, కాకర కిలో రూ.60, చిక్కుడు కిలో రూ.120, బీన్స్‌ కిలో రూ.74 ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు సామాన్యునికి అందనంత ఎత్తుకు ఎగబాకాయి. నిత్యావసరాల ధరలతోపాటు అన్ని వస్తువుల ధరలు పెరగడానికి ప్రధాన కారణం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగిపోవడమే. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీటర్‌ పెట్రోల్‌ రూ.120కు చేరువకాగా డీజిల్‌ రూ.వంద పలుకుతోంది. దీంతో రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నిత్యావసర, కూరగాయల ధరలు సైతం అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.తగ్గిన వేతనాలు.. పెరిగిన ధరలు కరోనా తర్వాత ఉపాధి అవకాశాలు దెబ్బతిని సామాన్య కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆక్వాతోపాటు అనేక పరిశ్రమల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పని చేసినా రోజుకు రూ.220కు మించి వేతనం ఇవ్వడం లేదు. నెలంతా కష్టపడినా రూ.ఆరు వేలు రావడం గగనంగా మారింది. ఆక్వా చెరువులు పెరిగిపోవడంతో వ్యవసాయ కూలీలకు పనులు తగ్గిపోయాయి. దీంతో ఎంత కూలి ఇస్తే అంతే కూలికి పనికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కుటుంబమంతా కష్టపడినా నెలకు రూ.పది వేలు సంపాదించడం గగనంగా మారింది. ఇలాంటి కుటుంబాలు పెరిగిన ధరలతో రూ.వేలు ఖర్చు పెట్టి పండుగను సంతోషంగా ఏవిధంగా జరుపుకుంటాయో ప్రభుత్వాలే చెపాల్సి ఉంది. సామాన్యులకు ఉచితంగా ఏదో ఇచ్చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వాలు, ధరల రూపంలో పీల్చిపిప్పి చేస్తున్నాయి. దీంతో ఒకప్పుడు ఎంతో సంతోషంగా జరిగే పండుగలు నేడు వెలవెలబోతున్నాయి.

➡️