పట్టు బిగించిన విద్యార్థులు.. దిగోచ్చిన అధికారులు

Nov 30,2023 15:07 #Dharna, #SFI
  •  సానుకూల దృక్పథంతో చర్చలకు సిద్ధం

ప్రజాశక్తి-కలెక్టరేట్‌(మన్యంజిల్లా) : విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గురువారం చేపట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో భాగంగా పార్వతిపురం కాంప్లెక్స్‌ నుండి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో విద్యార్థులంతా బైఠాయించి ధర్నా చేపట్టారు .ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, అధ్యక్షులు పండు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను తెలియజేస్తూ అక్టోబర్‌ నెలలో చేపట్టిన సైకిల్‌ యాత్రలో భాగంగా జిల్లా అధికారులకు తెలియజేసినప్పటికీ నేటి వరకు ఎటువంటి స్పందన లేదని, గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రంలో దీక్షలు చేపట్టినప్పటికీ నేటికీ అధికారులకు పాలకులకు చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, పార్వతీపురంలో ప్రభుత్వ ఐటిఐ, మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, పార్వతిపురం, పాలకొండలలో పిజి సెంటర్లను ఏర్పాటు చేయాలని, కురుపాంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇంజనీరింగ్‌ కళాశాల పనులు ప్రారంభించాలని, గరుగుబిల్లి సీతంపేట మండలాల్లో జూనియర్‌ కళాశాలలు నిర్మించాలని, వాస్తు గృహాలు భవనాలను నిర్మించాలని, మెస్‌ బిల్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ విద్యార్థుల సమస్యలను సంబంధిత జిల్లా యంత్రాంగంతో విద్యార్థి సంఘ నాయకులకు చర్చలను డిసెంబర్‌ 6వ తేదీన సిద్ధం చేస్తున్నట్లుగా డిఆర్‌ఓ ఇన్చార్జ్‌ కేశవ నాయుడు ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన్యం జిల్లాలోని అన్ని మండలాల విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.

➡️