పేదరికంతో చదువుకు దూరం కాకూడదు : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి పేదరికంతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నుంచి జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్‌, డిసెంబర్‌-2023 త్రైమాసికానికి సంబంధించి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, బటన్‌ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రాయచోటి కలెక్టరేట్‌ విసి హాలు నుండి కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి జాకీర్‌ హుస్సేన్‌, బిసి సంక్షేమ శాఖ అధికారి సందప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి స్థాయి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం విద్యార్థుల అదష్టమని ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ప్రతి ఒక్కరూ ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, ఆపై స్థాయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి ఈ పథకం ఒక వరం లాంటిదని ప్రభుత్వం అందిస్తున్న విద్య దీవెన సాయం సద్వినియోగం చేసుకొని మీరు ఎంచుకున్న లక్ష్యం పైపు అడుగులేయాలన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అభివద్ధి చేయడం జరిగిందని ఇంత మంచి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్‌, డిసెంబర్‌-2023 త్రైమాసికానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అర్హులయిన 31,478 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.24.80,81,198 మెగా చెక్కును విద్యార్థులు వారి తల్లులకు జిల్లా కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో మైనార్టీ శాఖ, విద్యాశాఖ అధికారులు, జిల్లాలోని పలు డిగ్రీ, ఇంజినీరింగ్‌ ఇతర ప్రొఫైషనల్‌ కోర్సుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

➡️