ప్రభుత్వ మెడకు వ్యతిరేక ఉచ్చు

Dec 23,2023 21:26

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :   రాష్ట్ర ప్రభుత్వం మెడకు ఉద్యోగులు, స్కీమ్‌వర్కర్ల వ్యతిరేక ఉచ్చు బిగుసుకుంది. హామీల అమలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో వీరంతా ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ప్రభుత్వ విధానాలపై రైతుల్లోనూ అసహనం పెరుగుతోంది. ఓవైపు వివిధ తరగతులకు చెందిన ప్రజానీకం నిరసన హోరు తారా స్థాయికి చేరుతుంటే, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ కొత్త ఆటకు తెరలేపింది. మరోవైపు ప్రభుత్వంతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు రాజకీయ చదరంగంలో బిజిబిజీగా ఉన్నారు. బహుశా అందుకేనేమో గడిచిన పది రోజులుగా జిల్లా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలతో అట్టుడుకుతున్నా, పలు రంగాలకు చెందిన స్కీమ్‌ వర్కర్లు సమ్మెసైరన్‌ మోగించినా స్పందించడం లేదు. పైగా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినఅప్పలనాయుడు ‘ఒళ్లు బలిసి రోడ్లమీదకు వస్తున్నారు’ అంటూ అంగన్‌వాడీలపై అణుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అంగన్‌వాడీలతోపాటు పలు ట్రేడ్‌ యూనియన్లు, ఉద్యోగ, కార్మిక సంఘాలు కూడా ఘాటుగానే స్పందించడంతో ఆ ఎమ్మెల్యేకు తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సంగతి కాస్త అటుంచితే, తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మెలోకి దిగి 12 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించ లేదు. పైగా సమ్మె విరమించాలంటూ జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ నిన్నగాక మొన్న విశాఖపట్నంలో కోరారు. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వేతనాలు పెంచే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశారు. తగ్గేదే లే అన్నట్టుగా అంగన్‌వాడీలు తమ సమ్మెను కొనసాగించడంతోపాటు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఈనేపథ్యంలో సిపిఎం తదితర వామపక్ష పార్టీలు మరో అడుగు ముందుకు వేసి, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే తమ ప్రత్యక్ష మద్ధతు ప్రకటిస్తామని చెప్పాయి. ఇప్పటికే నల్ల రిబ్బన్లు కట్టుకోవడం, మోకాళ్లపై నిలబడడం, వంటావార్పు, ధర్నాలు, రాస్తారోకో తదితర రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన అంగన్‌వాడీలు మౌనం వీడి సిఎం జగన్‌, వైసిపి ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పుతూ ఆటపాటలకు తెరలేపారు. మరోవైపు తాళాలు పగలుగొట్టి మరీ సచివాలయ ఉద్యోగులతో కేంద్రాలను తెరిపిద్దామని ప్రభుత్వం భావించిన పరిస్థితుల్లో పిల్లల తల్లిదండ్రులు కూడా అంగన్‌వాడీలకే మద్ధతు తెలపడంతో ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది. ఈనేపథ్యంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ అంగన్‌వాడీలు దీక్షబూనారు. ఇంకోవైపు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఖబడ్థార్‌ అంటూ ఆశావర్కర్లూ ఆందోళన చేస్తున్నారు. సర్వశిక్షాభియాన్‌ పరిధిలోని 18 విభాగాలకు చెందిన కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నాలుగు రోజులుగా సమ్మెబాట పట్టారు. అంగన్‌వాడీలు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెను ఆదర్శంగా తీసుకున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, గ్రామాల్లో గ్రీన్‌ అంబాస్‌డర్లు కూడా తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 26నుంచి సమ్మెలోకి వెళ్తామంటూ ఇప్పటికే కమిషర్లకు సమ్మెనోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. విఆర్‌ఎగా ప్రమోషన్‌ ఇవ్వడంతోపాటు పేస్కేల్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ విఆర్‌ఎలు ఆందోళన బాటపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇటీవల కాలంలో ఇరు జిల్లాల్లోనూ ర్యాలీలతో నిరసన తెలిపారు. తమకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, పని ఒత్తిడి, వేధింపులకు పాల్పడుతున్నారని, ఉపాధ్యాయులు చాలా కాలంగా గుర్రుగా ఉన్నాయి. ధరలో దగా, తూకంలో మోసం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘం నాయకులు వినతులు, వార్నింగులతో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం భరతం పడతామంటూ సిపిఎం ఆధ్వర్యాన వామపక్ష పార్టీలన్నీ ఇటీవల ఒక్క తాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాలో జ్యూట్‌, చక్కర పరిశ్రమలను తెరిపించాలని, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, తోటపల్లి, జంఝావతి సహా అనేక గెడ్డలపై ప్రతిపాదనలోవున్న మినీ రిజర్వాయర్లను నిర్మించాలని, మన్యం జిల్లాలో మెడికల్‌ కాలేజీ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన ఇటీవలే సమర శంఖారావం మోగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి ఇవేవీ పట్టకపోవడంతో కేవలం ఉద్యోగులు, స్కీమ్‌ వర్కర్లే కాకుండా రైతులు, పేద, మధ్యతరగతి ప్రజానీకంలో వ్యతిరేకత పెరుగుతోంది.

➡️