ప్రారంభాల పరేషాన్‌

Mar 16,2024 22:01

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జిల్లాలో ఇటీవల చేసిన ప్రారంభోత్సవాలు జనాన్ని పరేషాన్‌ చేస్తున్నాయి. ఐదేళ్లు ఊరుకుని ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు హడావుడిగా పూర్తిచేయడం, కొన్ని ఇంకా పూర్తికాకుండానే మన జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి సహా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎమ్మెల్యేలంతా కొద్ది రోజులుగా భవనాలు, రోడ్లు, కాలువలు, పార్కులు, బస్‌ షెల్టర్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కానీ, చాలా వరకు అసంపూర్తిగా ఉండడం, పూర్తిచేసిన వాటికి బిల్లులు విడుదల చేయక పోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లతో పాటు యావత్తు జిల్లా ప్రజానీకం విస్తుపోతున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ తదితర భవనాలను ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో తలపెట్టారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 530 గ్రామ సచివాలయాలు ఉండగా వీటిలో 498 సచివాలయ భవనాలు, 496 రైతు భరోసా కేంద్రాలకుగాను 291 భవనాలు, 311 వెల్‌నెస్‌ సెంటర్లకుగాను 178పూర్తి భవనాలు మాత్రమే నిర్మించాలని 2019లోనే ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. నిధులు విడుదల చేయక పోవడంతో 123 గ్రామ సచివాలయాలు, 126 రైతు భరోసా కేంద్రాలు, 133 విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు చొప్పున మొత్తం 382 భవన నిర్మాణాలు రూప్‌లెవెల్‌, గోడలు, పునాదుల స్థాయిలో నిలిచిపోయాయి. చాలా వరకు ఏళ్ల తరబడి మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. మరో 32 గ్రామ సచివాలయాలు, 79ఆర్‌బికెలు, 124 విలేజ్‌ హెల్త్‌క్లీనిక్‌ల చొప్పున ఈ మూడు విభాగాలకు చెందిన 235 భవనాలకు కనీసం ప్రతిపాదనలు కూడా లేవు. పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా 311 గ్రామ సచివాలయ భవనాలకు గానూ, 253భవనాల పనులు ప్రారంభించగా, 125 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 301 ఆర్‌బికె భవనాలకు గాను, 178 నిర్మాణాలు చేపట్టగా, 100 మాత్రమే పూర్తైయ్యాయి. 192 విలేజ్‌ క్లీనిక్‌ భవన సముదాయాలు చేపట్టగా ఇందులో చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి. మొత్తం భవన నిర్మాణాలకు సంబంధించి రూ.10కోట్ల వరకు బకాయి ప్రభుత్వం నుంచి రావాల్సివున్నట్టు సమాచారం. ఈ రెండు జిల్లాల్లో సచివాలయ, ఆర్‌బికె, విలేజేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవన నిర్మాణాల బకాయిలు సంక్రాంతిలోపే చెల్లిస్తామని, పనులు ముమ్మరం చేయాలని అంటూ జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు హామీ ఇచ్చినప్పటికీ, ఆ మాట ప్రకారం నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. అక్కడక్కడ పూర్తయిన భవనాలను మంత్రి, ఎమ్మెల్యేలు గడిచిన 15రోజులుగా తెగేసి ప్రారంభాలు చేసినప్పటికీ వాటికీ బిల్లులు చేయడంలో విఫలమయ్యారు. మరోవైపు విజయనగరంలోని పలు పార్కులు, బస్‌ షెల్టర్లు పూర్తికాకముందే డిప్యూటీ స్పీకర్‌ ప్రారంభోత్సవాలు చేయడం పట్ల జనం ఔరా…! అంటూ విస్తుపోతున్నారు.

➡️