మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి. వెంకటరామయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులకు సమ్మె చేపట్టారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి ప్రజాసంఘాలతో కలసి ర్యాలీని ప్రారంభించి బస్టాండ్‌, వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ మీదుగా బంగ్లా చేరుకుని మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సమ్మెకు సిఐటియు అన్నమయ్య జిల్లా కమిటి నుంచి ముఖ్య ఆహ్వనితులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికులు సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వ పెద్దలకు అభ్యర్థించి, వినతులు సమర్పించారని చెప్పారు. విసిగి పోయిన కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా ‘ఒక సంవత్సరం ఓపిక పట్టండి మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపే కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందరిని రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన- వేతనం చెల్లిస్తాం’ అని చెప్పిన మాటను గాలికి వదిలేశారని అన్నారు. కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జిఒ 30 ప్రకారం పంపు ఆపరేటర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వర్కర్స్‌ ,వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కం ప్యూటర్‌ ఆపరేటర్లు, బిల్‌ కలెక్టర్లు, స్ట్రీట్‌ లైటింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, ఆఫీసు నిర్వహణ కార్మికులకు వేతనాలు పెంచుతామని మూడేళ్లుగా హామీలతోనే సరిపె డుతున్నారు. ఎంఆర్‌పిఎస్‌ జాతీయ నాయకులు యస్‌. రామాంజనేయులు, ఒపిడిఆర్‌ రాష్ట్ర సహాయక కార్యదర్శి టి. ఈశ్వర్‌ లంబాడి హక్కుల సంఘంనాయకులు శంకర్‌ నాయక్‌ న్యాయవాది రాజులు మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వారి సమ్మెకు మద్దతు ఇచ్చారు. మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు చెన్నయ్య, రాంబాబు అగ్గిరామయ్య మాట్లాడుతూ 10-15 ఏళ్లుగా నైపుణ్యంతో కూడిన పనులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌ కార్మికులకు టెక్నికల్‌ వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం దాగా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఫలితం శూన్యమని చెప్పారు. పట్టణాల విస్తీర్ణం, జనాభా పెరుగుదల దష్ట్యా కార్మికులను పెంచడం లేదని విశ్వ విపత్తు కరోనా సందర్భంగా తీసుకున్న అదనపు సిబ్బందికి ఉద్యోగ భద్రత లేదన్నారు. సిపిఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని విస్మరించారని మండి పడ్డారు. సమ్మెతోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. రాజంపేట అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరేవరకు పోరు ఆగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పురపాలక కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం మున్సిపల్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో పురపాలక కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ సమ్మె ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ ఓబయ్య, కార్మికులు రమణ, ప్రసాద్‌, లక్ష్మీదేవి పాల్గొన్నారు. బి.కొత్తకోట : నగర పంచాయతీ కార్మికులు న్యాయపరమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం బి.కొత్తకోట నగర పంచాయతీ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధ నగర పంచాయతీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పి.శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పారిశుధ్య కార్మికులు ఎంతో కషి చేశారన్నారు. ారికి ఎంత జీతం ఇచ్చిన తక్కువేనంటూ, వారికి ఉద్యోగం భద్రత కల్పిస్తూ జీతాలు పెంపు చేస్తామని తెలిపిన ముఖ్యమంత్రి ఇప్పుడు వారికి ఇచ్చిన హామీని మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఇచ్చిన హామీలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మదనపల్లి సీనియర్‌ నాయకులు హరీందర్‌ శర్మ మాట్లాడుతూ నగర పంచాయతీ కార్మికులకు అలవెన్స్‌,ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కార్మికులు ఆవుల శ్రీనివాసులు,ఆవుల వెంకటరమణ, శివ, కేశవ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

➡️