మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమ్మె

Dec 26,2023 21:36

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌,బొబ్బిలి, రాజాం,నెల్లిమర్ల  :  తమను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు,ఔట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి సమ్మెకు దిగారు. విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాంలో విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఆరోగ్యాలు కాపాడుతున్న మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు, డ్రైవర్లకు రిస్క్‌, హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలన్నారు. జీవో 30ను సవరించి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ముషిడిపల్లి, రామతీర్థాలు, నెల్లిమర్ల పంపుహౌస్‌, విలీన ప్రాంత కార్మికులకు ఆప్కాస్‌లో చేర్చి జీతాలు, రిస్క్‌ అలవెన్స్‌ లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు, బ్లౌజులు, పనిముట్లు ఇవ్వాలన్నారు. క్లాప్‌ వాహనాలు డ్రైవర్లకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె విరమించేది లేదని తెలిపారు. సమ్మెకు పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ, బి.భాస్కరరావు, రాజు కార్మికులు పాల్గొన్నారు.

బొబ్బిలి పట్టణంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి హామీని అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర సేవలను కూడా నిలిపివేసి ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అద్యక్ష,కార్యదర్శులు గౌరీష్‌, జె. రామారావు, నాయకులు వెంకట్‌, యుగంధర్‌, జి.శంకరరావు, వాసు, కార్మికులు పాల్గొన్నారు.

రాజాం నగర పంచాయతీలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తినాయుడు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.

నెలిమర్లలో నగర పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు టివి రమణ మాట్లాడారు. రిటర్మెంట్‌ బెనిఫిట్స్‌ 5 లక్షలు, ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ ఆలవెన్స్‌, డ్రైవర్లకు ఆక్యుపెన్సీ అలవెన్స్‌ ఇవ్వాలని, బకాయి హెల్త్‌ అలవెన్సులు, జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కిల్లంపల్లి రామారావు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు బాబూరావు, హరిబాబు, శ్రీను, సురేష్‌, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

➡️