ముసురుకుంది..

మిచౌంగ్‌ తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడకపోవడంతో చాలా ప్రాంతాల్లో పంట ఎండిపోయింది. ఈ నేపథ్యంలో చెరువులు, బోరుల్లో ఉన్న నీటిని తోడించి పంటను తడుపి రక్షించుకున్నారు. మరో వైపు తెగుళ్లు కూడా పంటలపై విరుచుకుపడ్డాయి. వీటి నుంచి కూడా పంటను రక్షించుకున్న రైతులు ఈ ఏడాది తిండి గింజలకు కొదవు లేదనుకున్నారు. అయితే మిచౌంగ్‌ తుపాను వార్త రైతులను కుంగ దీసింది. అప్పటికే కోసం పొలాల్లో ఉన్న పంటను ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తమై కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎడతెరిపి లేని వర్షం వల్ల పొలాల్లో నీరు చేరడంతో వరి కుప్పలు నీటమునిగి వరి మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు పొలంలో చేరిన నీటిని దారి మళ్లించే పనిలో నిమగమయ్యారు..

ప్రజాశక్తి- జామి : తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువు, పల్లపు ప్రాంతాలు నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తహశీల్దార్‌ హేమంత్‌ కుమార్‌ జాగారం గ్రామంలోని చెరువులతో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు. మరోవైపు ధాన్యం రైతులకు పలు సూచనలు చేస్తూనే, తుపాను హెచ్చరికల పై ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు అందిస్తున్నారు. మండలంలో వరి కోతలు ముందస్తుగా జరగడంతో, తుపాను హెచ్చరికలతో రైతాంగం మెలుకోడం కొంత వరకు ముప్పు నుంచి భయట పడ్డారు. అయినప్పటికీ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం నిలిచిపోయింది. క్వారీ, కూలి పనులు లేక కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. తుపాను ప్రభావం మరో 24 గంటలు ఉంటుందన్న వాతావరణం శాఖా హెచ్చరికలు జనాన్ని కంగారు పెడుతున్నాయి.రైతుల అప్రమత్తంగుర్ల : తుపాను నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు గడిచిన నాలుగు రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశారు. వరి చేను కోతలను వాయిదా వేసు కోవాలని, కోసిన వరి పంటను చిన్న చిన్న కుప్పలు వేసుకోవాలని సూచనలు చేయడంతో రైతులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం చిన్న చిన్న చిరుజల్లులు కురవడంతో పొలంలో ఉన్న కుప్పలు తడిచి ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు వర్షాలు లేక వరి పంట దెబ్బతిందని, ఇప్పుడు పండిన పంట చేతికందే సమయంలో వర్షాల వల్ల నష్టం చేకూరుతుందని రైతులు వాపోతున్నారు.

వర్షపు నీరు దారి మళ్లింపువేపాడ: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు వల్ల పొలంలో నీరు చేరండంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడతాయని ముందస్తు సమాచారంతో చాలా మంది రైతులు పొలాల్లో వరి చేలను చిన్న చిన్న కుప్పలుగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు తుపాను కారణంగా కురిసిన వర్షాలకు నీరు పొలంలో చేరింది. దీంతో రైతులు పొలంలో చేరిన నీటిని బయటకు మళ్లించేందుకు తంటాలు పడుతున్నారు. పొలం మధ్యలో నుంచి కాలువలు వేసి నీటిని చెరువులకు మళ్లించి వరి కుప్పలను కాపాడుకుంటున్నారు. ధాన్యం రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలిరామభద్రపురం: మండలంలో రైతులంతా తుపాను దృష్ట్యా ధాన్య రాశుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తహశీల్దారు సులోచనా రాణి సూచించారు. స్థానిక వ్యవసాయాధికారి వెంకటయ్యతో కలిసి మంగళవారం తారాపురంలో తుపాను తీవ్రత వల్ల రైతుల ఇబ్బందులు స్వయంగా తెలుసుకొని ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ పొలంలో పనలు తడిస్తే 5 శాతం ఉప్పు నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని పనలు తడిచేలా పిచికారీ చేసుకోవాలన్నారు. అనంతరం కొట్టక్కిలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర మోడరన్‌ రైస్‌ మిల్‌ను సందర్శించి రైతులకు ఇబ్బంది లేకుండా వారు తీసుకు వచ్చిన ధాన్యాన్ని తీసుకోవాలని, వారికి అవసర మయ్యే సంచులను ఆర్‌బికెల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలిపూసపాటి రేగ : తుపాను నేపథ్యంలో తీర ప్రాంతంలోని వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి ఎస్‌ భాస్కరరావు అన్నారు. మంగళవారం ఆయన జిల్లాలోని తీర ప్రాంతాలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 21 మత్స్యకార గ్రామాలను అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. చింతపల్లిలో ఏర్పాటు చేసిన బేస్‌ క్యాంపును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను లోను, తుపాను అనంతరం వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. కావలసిన మందులన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం గోవిందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తుపాను, తదితర అంశాలపై ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ మూడు రోజులు పాటు మత్స్యకార గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పిహెచ్‌సిల్లో కుక్కకాటుకు, పాముకాటుకు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆయనతోపాటు డాక్టర్‌ జి. వెంకటేష్‌, గోవిందపురం వైద్యులు డాక్టర్‌ త్రినాథ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.వేటకు వెళ్లని మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలిభోగాపురం: తుపాను కారణంగా వారం రోజులుగా వేటకు వెళ్లని మత్స్యకారులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నెల్లిమర్ల నియోజకవర్గం ఇంచార్జ్‌ కర్రోతు బంగార్రాజు డిమాండ్‌ చేశారు. తీర ప్రాంతమైన ముక్కాం గ్రామంలో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు. అక్కడ మత్స్యకారులతో తుపాను ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేటకు వెళ్ళని మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. రైతులు కూడా తుపాను తీవ్రతతో నష్టపోయారని వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో విపత్తులు వచ్చేటప్పుడు ముందస్తుగా హెచ్చరించి నష్టం తీవ్రతను తగ్గించే వారన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి కనపడటం లేదన్నారు. ఒకవేళ ఎక్కడైనా తడిసిన ధాన్యం ఉంటే వాటిని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిశీలనలో నాయకులు బడే నాయుడు, తెల్లపల్లి అప్పన్న, కారి అబ్బాయి, బడే సింహాచలం, వార్డు మెంబర్‌ బడే అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

➡️