విద్యుత్‌ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

యూనియన్‌ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డిప్రజాశక్తి- కడప అర్బన్‌ విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగ, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని యునైటెడ్‌ ఎలక్ట్రికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం విద్యుత్‌ భవన్‌ ఎదురుగా విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు, ఉద్యోగులు సిఐటియు అనుబంధ సంఘాలైన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను ముఖ్యమంత్రి హామీ మేరకు వెంటనే రెగులైజ్‌ చేయాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర నాయకులు సి.హెచ్‌. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ యాజమాన్యం విద్యుత్‌ కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను ఉదతం చేస్తామని పేర్కొన్నారు. డిస్కం ప్రెసిడెంట్‌ ఎం. శివశంకర్‌ మాట్లాడుతూ యూనియన్లు చేసుకున్న ఒప్పందం మేరకు విద్యుత్‌ ఉద్యోగులకు వేతన బకాయిలు, కరువు బత్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు నాగసుబ్బయ్య శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో కొన్ని డివిజన్లలో ఇపిఎఫ్‌ సక్రమంగా అమలు కావడం లేదని వాపోయారు. కాంట్రాక్ట్‌ కార్మికుల నాయకులు బాలకష్ణ సురేంద్ర మాట్లాడుతూ మీటర్‌ రీడర్ల పీస్‌ వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం యాజమాన్యం దష్టి సారించాలని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు కెన.సురేంద్రబాబు మాట్లాడుతూ ధర్నా కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారం కాకుంటే ఎస్‌పిడిసిఎల్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నా చేస్తున్న ప్రాంతానికి విద్యుత్‌ ఎస్‌ఇ వచ్చి తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని, మిగతా వాటిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామి ఇచ్చారు. అనంతరం కార్మికులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయబ్‌ రసూల్‌, జిల్లా నాయకులు నాగమల్లయ్య, రాజంపేట డివిజన్‌ అధ్యక్షుడు ఎరికల్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️