విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు ఒడిశా అడ్డగింత

Mar 28,2024 21:35

ప్రజాశక్తి – సాలూరు: కొటియా గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కుక్క తోక వంకర అన్న చందంగా ఒడిశా వంకర బుధ్ధి మారడం లేదు. గురువారం వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఒకటైన గంజాయిభద్రలో ఇళ్ల కు విద్యుత్‌ మీటర్ల బిగింపునకు విద్యుత్‌ సిబ్బంది వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కొటియా పోలీసులు అక్కడకు చేరుకుని విద్యుత్‌ మీటర్ల బిగింపును అడ్డుకున్నారు. పొట్టంగి సమితి అధికారులు అక్కడికి చేరుకుని విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు చేయొద్దని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున మీటర్లు బిగించి వద్దని వారు ఆదేశించారు. అంతేకాక విద్యుత్‌ మీటర్లు వున్న ఆటోను కొటియా పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో సాలూరు మండలానికి చెందిన విద్యుత్‌ సిబ్బంది సబ్‌ డివిజనల్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై గంజాయి భద్ర మాజీ సర్పంచ్‌ గెమ్మెల భీషు ఒడిశా పోలీసులు, అధికారులను నిలదీశారు. గ్రామంలో ఇళ్లకు విద్యుత్‌ మీటర్లు లేక చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఒడిశా వారు చేయరు, చేస్తున్న ఎపి సిబ్బందిని అడ్డుకోవడం తగదని వాదించారు. దీనిపై ఎడిఇ రంగారావును వివరణ కోరగా గంజాయిభద్రలో ఇళ్లకు విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు చేస్తుండగా కొటియా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.దీనిపై తమ ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు.

➡️