శ్రీదేవి, గిరిధర్‌పై అనర్హత వేటు!

Feb 27,2024 00:27

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్య తీసుకుంటూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఒక పార్టీ తరుఫున ఎన్నికై మరో పార్టీలో చేరడంపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వీరు పూర్తిస్థాయిలో పదవి నిర్వహించకుండానే చివరి మూడునెలల కాలంలో అనర్హతకు గురయ్యారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన మద్దాలి గిరిధర్‌ 2020లో వైసిపిలో అధికారికంగానే వైసిపిలో చేరారు. ప్రత్యక్షంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ అంశంపై స్పీకర్‌కు టిడిపి ఫిర్యాదు చేసింది. దాదాపు మూడున్నరేళ్లపాటు పిటీషన్‌ను పెండింగ్‌లో పెట్టిన స్పీకర్‌ ఇటీవల విచారణ చేపట్టారు. టిడిపి అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిందే తప్ప పార్టీ నుంచి బహిష్కరించలేదని, అందువల్ల మద్దాలి గిరిధర్‌కు అనర్హత వేటు వర్తిస్తుందని సీనియర్‌ ఎమ్మెల్సీ ఒకరు తెలిపారు. దీంతో పదవీ కాలం ముగియడానికి మూడునెలల ముందుగానే మద్దాలి గిరి అనర్హత వేటుకు గురయ్యారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గతేడాది మార్చిలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థికి కాకుండా టిడిపి అభ్యర్థికి ఓటు వేశారని అభియోగాన్ని ఎదుర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలని వైసిపి స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గతేడాదిగా పలుమార్లు విచారణ చేపట్టిన స్పీకర్‌ చివరకు ఆమెపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గిరిధర్‌ ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆయన రాజకీయాల్లో నిర్వహించాల్సిన పాత్రపై వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి ఏదోఒక నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అవకాశం ఇస్తే బాపట్ల లోక్‌సభకు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు టిడిపి అగ్రనేతలను కలిసి చర్చించారు. ఈ నేపథ్యంలో అనర్హత వేటు ఆమెకు ప్రతిబంధకంగా మారుతుందా? అనేది చర్చనీయా ంశంగా మారింది. అయితే ఆమెను వైసిపినుంచి బహిష్కరి ంచడం వల్ల అనర్హత వేటు వర్తించదని టిడిపి వర్గాలు అంటు న్నాయి. అందువల్ల ఆమె హైకోర్టులో ఛాలెంజ్‌ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి టిడిపి అభ్యర్థికి ఓటు వేయడంతో శ్రీదేవితోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన మరో ముగ్గురు వైసిపి ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే.

➡️