సంపూర్ణ పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత

Dec 18,2023 19:59

  ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌  :  నగర అభివృద్ధి తో పాటు సంపూర్ణ పారిశుద్యానికి అధిక ప్రాధాన్యతిస్తున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అందులో భాగంగానే సోమవారం గుణుపూరు పేట లో ఉన్న డంపింగ్‌ యార్డ్‌ వద్ద రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన బయో రెమిడీయేషన్‌ లెగ్గసి వేస్ట్‌ ల్యాండ్‌ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించారు. నగరంలో పేరుకుపోయిన చెత్తాచెదారాలను ప్రత్యేక పారిశుధ్య వాహనాలలో గుణుపూర్‌ పేటకు తరలించే విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉన్న ప్రాంతాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు, ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్తాచెదారాలను వేరు చేసే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 15 కోట్ల రూపాయలు వెచ్చించి చెత్త వర్గీకరణ యంత్రాలతో పాటు భూమి చదును చేసే ప్రక్రియను కోలగట్ల ప్రారంభించారు. కోలగట్లతో పాటు మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ లయా యాదవ్‌, కమిషనర్‌ ఆర్‌ శ్రీ రాములనాయుడు తదితరులు లెగ్గసి వేస్ట్‌ ల్యాండ్‌ ప్రక్రియ విధానాన్ని ఆశాంతం పరిశీలించారు. అనంతరం కోలగట్ల మాట్లాడుతూ చదును ప్రక్రియ పూర్తయిన తర్వాత 16 ఎకరాల స్థలం నగరపాలక సంస్థ ప్రత్యామ్నాయ వినియోగంలోకి తీసుకు రావచ్చుని తెలిపారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ఇన్చార్జి ఇఇ దక్షిణామూర్తి, ప్రజారోగ్య అధికారి కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️