సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఉన్నత పాఠశాలలలో పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన సబ్జెక్టు ఉపాధ్యాయుల స్థానంలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతలు కల్పించాలని, అప్పటివరకు తాత్కాలిక పని సర్దుబాటు కింద ఉపాధ్యాయులను నియమించాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్‌, పాలెం మహేష్‌ బాబు కోరారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని కోరుతూ యుటిఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డిఇఒ ఎం.అనురాధను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న పాఠశాల సహాయకులు ఉద్యోగ విరమణ చేశారని పేర్కొన్నారు. ఆ కారణంగా సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా విరమణ పొందిన వారి స్థానంలో ఉపాధ్యాయులను నియమించకపోవడంతో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలలో విద్యార్థులకు బోధన కుంటుపడుతుందని తెలిపారు. ముఖ్యంగా సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ప్రభావం 10వ తరగతి విద్యార్థులపై పడే ప్రమాదం ఉందన్నారు. విరమణ పొందిన వారితో పాటు, దీర్ఘకాలిక సెలవులు, ప్రసూతి సెలవులు పెట్టిన వారి స్థానంలో సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను నివారించడానికి సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు తాత్కాలిక ప్రాతిపదికన పని సర్దుబాటు చేసైనా సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.అనురాధ స్పందిస్తూ విరమణ పొందిన ఉపాధ్యాయుల స్థానంలో తాత్కాలికంగా పని సర్దుబాటు కింద ఉపాధ్యాయులను నియమిస్తామని, ఉద్యోగోన్నతుల విషయం రాష్ట్ర ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళతామని తెలిపారు. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను తీర్చాల్సిందిగా ఇప్పటికే ఉపవిద్యా శాఖ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సి.వి.రమణ, నాయకులు యడాల సురేష్‌ కుమార్‌, గాజుల పల్లె గోపీనాథ్‌, బత్తుల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️