సామాజిక బాధ్యతతో సేవలందించా

Mar 28,2024 20:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తన 39ఏళ్ల ఉద్యోగ జీవితంలో సామాజిక బాధ్యతగా భావించి సేవలు అందించానని ఎల్‌ఐసి విజయనగరం బ్రాంచ్‌ లో అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన మాంగిపూడి శ్రీనివాస తెలిపారు. ఈనెల 28న ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన ఉద్యోగ జీవితం గురించి వివరించారు. తల్లితండ్రులు మంగిపూడి కామేశ్వరి, సూర్యనారాయణ మూర్తి. నాకు నలుగురు అక్క చెల్లెళ్లు. తండ్రి స్వస్థలం విశాఖ జిల్లా చోడవరం. మా అమ్మగారి స్వస్థలం విజయనగరం. భార్య శశికళ పూసపాటిరేగ మండలం రెల్లివలస జెడ్‌పి హైస్కూల్‌లో ఉపాధ్యాయునిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు, కుమారుడు శరత్‌ చంద్ర బెంగుళూరులో పిడబ్ల్యుసి సంస్థలో సీనియర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె సింధూర ఢిల్లీ లోని మహిళా హార్డింగ్‌ మెడికల్‌ కాలేజీలో ఎమ్‌డి చేస్తోంది. ఒరిస్సా రాష్ట్రంలోని ఇబ్‌ అనే గ్రామంలో 1964 మార్చి 28న జన్మించాను. తండ్రి రైల్వేలో పనిచేసేవారు. తల్లి గృహిణి. తండ్రి రైల్వేలో పని చేయడం వలన 5వ తరగతి వరకు విద్యాభ్యాసం ఇంటి దగ్గరే జరిగింది. హైస్కూల్‌ విద్యను విజయనగరం బిపిఎం హైస్కూల్‌, ఇంటర్‌, డిగ్రీ ఎంఆర్‌ డిగ్రీ కాలేజీలో చదివాను. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేస్తుండగా ఎల్‌ఐసిలో అసిస్టెంట్‌గా ఉద్యోగ వచ్చింది. 1985 మే 1న ఉద్యోగంలో చేరాను. 3 నెలలు ట్రైనింగ్‌ అనంతరం 1985 ఆగష్టు 1న ప్రొబిషనరీ అసిస్టెంట్‌గా పలాసలో జాయిన్‌ అయ్యాను. అక్కడ పనిచేస్తుండగా పలాస ఎల్‌ఐసి బేస్‌ యూనిట్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. కార్యదర్శిగా చేస్తూనే ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ కో ఆర్డినేటర్‌ కమిటీ కన్వీనర్‌గా పని చేశాను. 1986 డిసెంబర్‌ 2 న విజయనగరం బ్రాంచ్‌కు బదిలీపై వచ్చాను. నా 38సంవత్సరాల 10 నెలలు సర్వీస్‌ లో 37ఏళ్ల 3 నెలలు విజయనగరం బ్రాంచ్‌ లోనే సర్విస్‌ పూర్తి చేశాను. విజయనగరం బ్రాంచ్‌లో యూనిట్‌ కార్యదర్శిగా, ఐసిఇయు డివిజన్‌ ఉపాధ్యక్షులుగా, ఎస్‌సిజెడ్‌ఐఇఎఫ్‌ జోనల్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టాను. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ పరిరక్షణ, ప్రజాతంత్ర ఉద్యమాలకు ఆకర్షితుడినై సమ సమాజ స్థాపన ధ్యేయంగా కృషి చేశాను.విజయనగరం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించాను. సిఐటియు అఖిల భారత కౌన్సిల్‌ సభ్యులుగా కూడా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో జ్యూట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించాను. ప్రస్తుతం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సిఐటియు ప్రధాన బాధ్యతలో ఉన్నప్పుడు ఫేకర్‌, జ్యూట్‌, వెరా లేబొరేటరీస్‌, భీమసింగి షుగర్స్‌ తదితర కంపెనీల్లోను, షాప్‌ ఎంప్లాయిస్‌, అంగన్వాడీ, మున్సిపల్‌, ఎలక్ట్రిసిటీ తదితర రంగాలలో యూనియన్‌లు ఏర్పాటు కావడంలో ముఖ్యభూమికను పోషించాను. ఈ యూనియన్‌లు చేపట్టిన ముఖ్యమైన పోరాటాల్లో కీలకమైన బాధ్యతలు వహించడం మరచిపోలేనిది. తల్లిదండ్రుల ఆశీస్సులు, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు, ఎఐఐఇఎ నాయకుల మార్గనిర్దేశంతో ఎల్‌ఐసిలో 39 సంవత్సరాల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకుని రిటైర్డు అయ్యాను. వీరందరి సహకారంతోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం, నమ్మిన సిద్ధాంతం కోసం కార్మిక, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇదంతా సామాజిక బాధ్యతగానే చేపట్టాను. ఉద్యోగ జీవితంలో సహకారం అందించిన ఉద్యోగులకు, కార్మిక రంగ ఉద్యమాల్లో సహకరిస్తున్న ప్రజా సంఘాలు, సిపిఎం నాయకులకు, నాకు అన్ని విధాలుగా అండగా ఉన్న కుటుంబ సభ్యులకు అభినందనలు. ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక బాధ్యతగా ప్రజలకు సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను.

➡️