సమస్యలపై పోరాడే వామపక్షాలకే ఓటు

  •  రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, దానికి వంతపాడే పార్టీలను ఓడిద్దాం
  • సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం అభ్యర్థులు శనివారం ముమ్మరంగా ప్రచారం చేశారు. తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ బిజెపి, వైసిపి, టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. మతోన్మాద బిజెపిని, ఆ పార్టీతో జతకట్టిన టిడిపి, జనసేనలను, రాష్ట్రంలో నిరంకుశ వైఖరితో మోడీ విధానాలు అమలు చేస్తున్న వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. సమస్యలపై పోరాడే వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని ఓట్లు అభర్థించారు.


నెల్లూరులోని 14వ డివిజన్‌లో నియోజకవర్గం అభ్యర్థి మూలం రమేష్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి పాల్గొన్నారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలులో విఫలమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా తీరని ద్రోహం చేసిందని వివరించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు ధారాధత్తం చేస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో తమకు 400 సీట్లు దక్కతాయని బూటకపు ప్రచారం చేస్తూ ప్రజలను మోడీ తప్పదారి పట్టించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన పార్టీలను, నిరంకుశ వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరాభివృద్ధికి మూలం రమేష్‌ను గెలిపించాలని కోరారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడులో పాణ్యం నియోజకవర్గం అభ్యర్థి డి.గౌస్‌దేశారు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలోని వడ్లోనివంకను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేయడంతో వర్షం వస్తే ఎస్‌సి, బిసి కాలనీలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత వర్షా కాలంలో ఇళ్లలోకి నీళ్లు వచ్చి దాన్యం తడిసి పోయి తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని వాపోయారు. ప్రధానంగా తాగునీటి సమస్య వెంటాడుతోందని తెలిపారు. గౌస్‌దేశారు స్పందిస్తూ రియల్టర్ల కోరల్లో నుంచి వడ్లోనివంకను కాపాడతానని, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో సిపిఎం మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, సిపిఐ పార్లమెంట్‌ అభ్యర్థి జంగా ఆంజనేయులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విశాఖలోని కొండవాలు ప్రాంతాలైన సుందరయ్యకాలనీ, దుర్గానగర్‌, అరుణోదయ కాలనీ, గుడివాడ గురునాథరావు కాలనీ, దిబ్బపాలెం, శ్రీనగర్‌, శ్రీరామ్‌నగర్‌, ఆఫీసర్స్‌ కాలనీ, కర్ణవానిపాలెం ప్రాంతాల్లో గాజువాక అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. జివిఎంసి 69వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో జగ్గునాయుడు గెలుపును కోరుతూ సిపిఎం నాయకులు ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అల్లూరి జిల్లా రాజవొమ్మంగిలో అభ్యర్థి లోతా రామారావు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ప్రచారంలో పాల్గొన్న రామారావుకు మహిళలు పూలమాలలు వేసి, తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. ఎటపాక మండలం గోళ్లగట్ట గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో సిపిఎం నాయకులు సమావేశమై సిపిఎం అభ్యర్థుని గెలిపించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు, బాలేసుగూడ, నెల్లికెక్కువ, వనకాబడిలో కురుపాం నియోజకవర్గం అభ్యర్థి మండంగి రమణ ప్రచారం నిర్వహించారు కొమరాడ మండలం కూనేరు సంతలో రమణ, ఎంపి అభ్యర్థి అప్పలనర్స విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. సిపిఎం అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపితే ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు ప్రచారం నిర్వహించారు. వాకర్లను, క్రీడాకారులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం 32వ డివిజన్‌ అయోధ్యనగర్‌, రామలింగేశ్వరపేట, బసవతారక నగర్‌, శాంతినగర్‌ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. రిక్షా తొక్కుతూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.


విజయవాడ రూరల్‌ మండలం గూడవల్లి, ఎనికెపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల్లో గన్నవరం నియోజకవర్గం అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ కళాకారులు పాటలు, వీధి నాటికల ద్వారా విస్తత ప్రచారం నిర్వహించారు. బిజెపిని, దానితో జతకట్టిన టిడిపి, జనసేనలను, నిరంకుశ వైసిపిని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

➡️