సిఎం హామీల అమలేది?

Feb 14,2024 23:30

విస్తరణకు నోచని గుంటూరు ఛానల్‌
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
సిఎం వైఎస్‌ జగన్‌ జిల్లాలోని ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారం కోసం హామీలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ హామీల అమలుకు మాత్రం యంత్రాంగం కార్యచరణ రూపొందించడం లేదు. 1995 నుంచి సిఎం హామీలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యచరణ రూపొందించి వెంటనే అమలుకు చర్యలు చేపట్టేది. 2019 వరకు ఇదే పద్థతి కొనసాగింది. కానీ వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సిఎం జగన్‌ ఇస్తున్న అనేక హామీలు కార్యరూపం దాల్చడంలేదు. 2022 నుంచి ఇప్పటి వరకు సిఎం జగన్‌ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అనేక సమస్యలను సిఎం జగన్‌ ప్రముఖంగా ప్రస్తావించి హామీల వర్షం కురిపిస్తుంటారు. కానీ ఆచరణమాత్రం చాలా తక్కువనేని చెప్పాలి. 2022 జనవరి ఒకటిన ప్రత్తిపాడు సభలో డబల్‌లైన్‌ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌, పెదనందిపాడులో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం తదితర హామీలను ఇచ్చారు. ఇంతవరకు వీటిల్లో ఏదీ చేపట్టలేదు. గుంటూరు ఛానల్‌ విస్తరణ పనులు నేటికి ప్రారంభం కాలేదు. భూసేకరణ ప్రక్రియ పనులు ముందుకు సాగడం లేదు. 2022 నవంబరు 11న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సభలో రూ.230 కోట్లతో భూగర్భ డ్రెయినేజి పనులను తిరిగి చేపడతామన్నారు. రూ.130 కోట్లతో శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి విస్తరణ, ఆధునీకకీకరణ పనులు, ఆర్‌యూబిలను చేపడతామన్నారు. ఇంతవరకు కదలిక లేదు. తెనాలి సభలో కొల్లిపరలో మార్కెట్‌ యార్డు, తెనాలి-విజయవాడ రోడ్డు విస్తరణతోపాటు పలు హామీలను ఇచ్చారు. వీటిపైనా స్పందన లేదు. మాచర్ల, వినుకొండ, వలివేరు, బాపట్ల, నగరం, తదితర ప్రాంతాలలో జరిగిన సభల్లో కూడా ఇచ్చిన వరాలు మచ్చుకయినా ఆచరణలోకి రాలేదు. క్రోసూరులో శంకుస్థాపన చేసిన అమరావతి-బెల్లంకొండ రోడ్డు విస్తరణ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. రాజధానిలోని వెంకటపాలెంలో 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తానని భరోసా ఇచ్చినా కోర్టు స్టే ఉత్తర్వులతో నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, విస్తరణకు సంబంధించి సిఎం జగన్‌కు ఎమ్మెల్యేలు బహిరంగ సభల్లో విన్నవించినా ఆయన హామీలు ఇచ్చినా ఆర్‌ఆండ్‌ బి శాఖకు నిధులు విడుదల కాకపోవడం వల్ల సిఎం హామీలు అమలు కావడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. మాచర్లలో సిఎం జగన్‌ ఇటీవల శంకుస్థాపన చేసిన వరికపూడిశెల పనులు ఇంత వరకు ప్రారంభం కాలేదు. ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపక్షపార్టీలు నిరసనలు తెలియజేస్తున్నాయి.

➡️