సేంద్రియ సాగుపై అవగాహన పెంచుకోవాలి

Nov 28,2023 21:32

ప్రజాశక్తి – సాలూరు : సేంద్రియ పంటల సాగుపై గిరిజన రైతులు అవగాహన పెంచుకోవాలని నీడ్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పి.వేణుగోపాలరావు కోరారు. మండలంలోని చినబారిగాంలో నీడ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన గిరిజన రైతులకు సేంద్రియ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడ్వాంటా కంపెనీకి చెందిన 12రకాల కూరగాయల విత్తనాలను 70మంది గిరిజన రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుతో ఆశించిన దిగుబడి సాధించవచ్చునని చెప్పారు. సేంద్రియ కూరగాయలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉందన్నారు. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా సేంద్రియ కూరగాయల వినియోగం పెరిగిందన్నారు. ప్రాజెక్టు ఎఒ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ భవిష్యత్తులో సేంద్రియ పంటల సాగు చేస్తున్న రైతులకు డిమాండ్‌ పెరుగుతుందని చెప్పారు. ఇంటి పక్కనున్న పెరట్లో గానీ, వ్యవసాయ భూమిలో గానీ సేంద్రియ పంటల సాగు చేయవచ్చునని చెప్పారు. అడ్వాంటా కంపెనీ కన్సల్టెంట్‌ రాధా మోదామెల్‌ మాట్లాడుతూ సేంద్రియ పంటల సాగులో అవసరమైన మెలకువలను రైతులకు అందిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సబ్‌ అసిస్టెంట్‌ సుబ్బరాజు, నీడ్‌ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది మహేష్‌, రామకష్ణ పాల్గొన్నారు.

➡️