స్పందించకుంటే సమ్మె ఉధృతం

కలెక్టరేట్‌కు ప్రదర్శన చేస్తున్న కార్మికులు
ప్రజాశక్తి-గుంటూరు :
మున్సిపల్‌ కార్మికుల జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని, ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే అత్యవసర సేవలూ నిలిపివేసి మరింత ఉధృతం చేస్తామని గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు అన్నారు. మున్సిపల్‌ కార్మికుల 14వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా తొలుత జిఎంసి ప్రధాన కార్యాలయం నుండి కలెక్టరేట్‌ వరకూ ప్రదర్శన చేశారు. అనంతరం కలెక్టరేట్‌ గేటు ఎదుట బైటాయించి ధర్నా చేపట్టారు. కార్మిక ప్రదర్శనలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని వివిధ మున్సిపాల్టీల నుండి మున్సిపల్‌ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాలరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నామని, కొత్త కోర్కెలు కోరట్లేదని అన్నారు. జీతాలు పెంచాలని కోరుతుంటే మంత్రుల బృందం 2022లో పెంచామని, మళ్లీ రెండేళ్లలోనే పెంచుతామా అని అంటున్నారని అన్నారు. ఈ ప్రభుత్వమే ధరలు అమాంతం పెంచిందని, ట్రూ అప్‌, సర్‌ చార్జీల పేరుతో విద్యుత్‌ భారాలు మోపిందని, ఆర్టీసీ ఛార్జీలు పెంచిందని విమర్శించారు. చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్పందనలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రాచూరి వేణు, సిఐటియు రాజధాని ఏరియా అధ్యక్షులు ఎం.రవి, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నాయకులు బి.వెంకటేశ్వర్లు, డి.వెంకటరెడ్డి, కె.వెంగమ్మ, తెనాలి పట్టణ కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం కన్వీనర్‌ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️