10 లీటర్ల లోపు మద్యం కేసులు తొలగింపు

Nov 28,2023 21:07

 ప్రజాశక్తి-విజయనగరం  :  జిల్లాలో సెబ్‌,పోలీసులకు 10లీటర్ల లోపు మద్యంతో మొదటిసారి పట్టుబడిన నిందితులపై కేసులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్‌పి ఎస్‌. వెంకటరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎస్‌ఇబి కమిషనర్‌ ఎం.రవి ప్రకాష్‌ ఉత్తర్వులను జారీ చేసారన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2020 మే 16 నుంచి ఈ ఏడాది ఆగస్టు 29 మధ్య కాలంలో నమోదు చేసి, మొదటిసారి నేరంకు పాల్పడిన వ్యక్తులకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఈ తరహా కేసుల్లో ఇప్పటికే 693 కేసులను తొలగించినట్లు తెలిపారు. ఇంకా 1047 కేసులు దర్యాప్తు దశలోను, కోర్టు విచారణలో ఉన్నట్లుగా గుర్తించామన్నారు. గుర్తించిన కేసుల్లో నిందితులకు ఇప్పటికే నోటీసులు జారీచేసి, నిర్ధేశించిన కాంపౌండింగు ఫీజు చెల్లించినట్లయితే, వారిపై దర్యాప్తులో ఉన్న లేదా కోర్టు విచారణలో ఉన్న కేసులను తొలగిస్తామన్నారు. 10 లీటర్ల లోపు ఐఎంఎఫ్‌ఎల్‌తో మొదటిసారి పట్టుబడితినే వారిపై నమోదైన కేసులను తొలగిస్తామన్నారు. ఈ తరహా కేసుల్లో డ్యూటీ పెయిడ్‌ లిక్కరు కేసుల్లో పట్టుబడిన మద్యం విలువకు మూడు రెట్లు, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కరు కేసుల్లో పట్టుబడిన మద్యం విలువకు ఐదు రెట్లు నగదు కాంపౌండింగ్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన నిందితులు స్వచ్చందంగా ముందుకు వచ్చి, సంబంధిత పోలీసులు లేదా సెబ్‌ వారిని సంప్రదించి, కసులను తొలగించుకొనేందుకు చొరవ చూపాలని కోరారు. జిల్లాలో నాటుసారా, మద్యం అక్రమ రవాణ, గంజాయి నియంత్రణకు ఎస్‌ఇబి సమర్థవంతంగా పని చేస్తున్నదని తెలిపారు. డ్రగ్స్‌ వినియోగం కలిగే అనర్థాలను ప్రజలకు, విద్యార్థులకు వివరించి, అవగాహన కల్పించేందుకు కళాశాలలు, ముఖ్య కూడళ్ళలో కార్యక్రమాలను చేపడుతున్నా మన్నారు. నాటుసారా, గంజాయి, మద్యం, డ్రగ్స్‌ నియంత్రణకు సమాచారం టోల్‌ ఫ్రీ నంబరు 14500 అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. సమావేశంలో విజయనగరం ఎస్‌ఇబి 1వ పట్టణ సిఐ బి.మధు కుమార్‌ పాల్గొన్నారు.

➡️