ఎన్నికల సామాగ్రి అందజేతకు 23 కౌంటర్లు

ఎన్నికల సిబ్బందితో జరిగిన సమావేశం మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి-రంపచోడవరం

ఈ నెల13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 399 పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలు, వివి ప్యాడ్లు, ఇతర ఎన్నికల సామాగ్రి పోలింగ్‌ అధికారులకు అందజేయడానికి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని రిసెప్షన్‌ సెంటర్‌ వద్ద 23 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు రంపచోడవరం నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రాంగణంలో రిసెప్షన్‌ సెంటర్‌ ఏర్పాట్లపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సెక్టార్‌ అధికారులు, రూట్‌ అధికారులతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ కుమార్‌, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రి అందజేత ప్రక్రియ ఈ నెల 12న ఉదయం ఏడు గంటల నుండి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ప్రారంభమవుతుందని తెలిపారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు పాడేరు, అరకు ప్రాంతాల నుండి ఎన్నికల అధికారులు, సిబ్బంది 11వ తేదీన వస్తారని, వారికి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈవీఎంలు, వివి ప్లాట్లు పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువెళ్లేటప్పుడు సూర్యరశ్మి తగలకుండా, ఇతరులు ఎవరు కూడా ఫొటోలు తీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై శనివారంలోగా నివేదికలు సమర్పించాలన్నారు. 399 పోలింగ్‌ కేంద్రాలలోనూ రెండు చొప్పున వెబ్‌ కాస్ట్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పిడిఎంఎస్‌ యాప్‌ ఏర్పాటు చేస్తామని, ఈ యాప్‌లో 13న ఎన్నికల పోలింగ్‌ శాతాన్ని, ఎన్నికలు జరుగుతున్న తీరుని పొందుపరచాలని సూచించారు. నెట్‌వర్క్‌ లేని ప్రాంతాలలో రన్నర్సును ఏర్పాటు చేస్తామన్నారు. 399 పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యలను తెలుసుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు కృష్ణజ్యోతి, ఏవి.రమణ, చలపతిరావు, డివి సత్యనారాయణ, సత్య సులోచన, మురళీకృష్ణ, నాగమణి, నాగరాజు, డిప్యూటీ తహశీల్దార్లు బి.రాజు, శివ, శ్రీధర్‌, స్వామి, చైతన్య, వీరభద్రరావు, బాలాజీ, సరిత, రవీంద్రబాబు, సుధాకర్‌ బాబు, ఎ.సత్యనారాయణ, రూట్‌ అధికారులు, సెక్టార్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️