గుంటూరు జిల్లాలో 5,076 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

May 8,2024 23:35

గుంటూరులో ఎసీ కాలేజీ వద్ద ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద సిబ్బందికి కమిషనర్‌
ప్రజాశక్తి-గుంటూరు :
ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బంది కోసం నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌లో బుధవారం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,076 ఓట్లు పోలయ్యాయి. వీటిలో లాంలోని చలపతి కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఏర్పాటు చేసిన తాడికొండ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 462, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి నిర్మలా హైస్కూల్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 1088, పొన్నూరుకు సంబంధించి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 426, తెనాలికి సంబంధించి శ్రీరావి సాంబయ్య మున్సిపల్‌ బార్సు హైస్కూల్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 442, ప్రత్తిపాడుకు సంబంధించి నల్లపాడు లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో 394, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ ఉమెన్స్‌ కళాశాల ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 1595, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 669 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి. దీంతో మొత్తం 5వ తేది నుండి 8వ తేదీ వరకూ నాలుగు రోజులపాటు జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌లో 20755 ఓట్లకుగాను 18,811 ఓట్లు పోల్‌ అయ్యాయి.
గుంటూరు తూర్పులో 97.6 శాతం పోస్టల్‌ బ్యాలెట్లు
స్థానిక ఏసీ కాలేజీలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌లో బుధవారం 669 ఓట్లు పోలయ్యాయి. సచివాలయ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, తదితరులు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ నాలుగు రోజులపాటు జరిగిన పోలింగ్‌లో మొత్తం 2714 ఓట్లు పోలయ్యాయి. వీటిలో గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి 2241 ఓట్లు ఉండగా, ఇతర జిల్లాలకు సంబందించిన ఓట్లు 473 ఉన్నాయి. గుంటూరు తూర్పులో ఫారం 12 దరఖాస్తు చేసుకున్న 2778 మందిలో ఇప్పటి వరకూ 97.6 శాతం సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్‌ గురువారం కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు పెంచటంతో మిగిలిన వారు కూడా ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కీర్తి చేకూరి పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.
గుంటూరు పశ్చిమలో 82.36 శాతం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బందికి స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌కు బుధవారం సిబ్బంది పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మొదటి మూడు రోజులు పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రంలో సౌకర్యాల లేమిపై ఉద్యోగ సంఘాలు, ఓటర్ల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో నాల్గవ రోజు కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచారు. కౌంటర్లు పెంచటంతో ఓటింగ్‌ కొంత సులభమైంది. పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మొదటి మూడ్రోజులు సౌకర్యాలపై ఫిర్యాదులు వచ్చాయని, అయితే వాటిని కొన్నింటిని మెరుగుపరిచారని అన్నారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవటం అభినందనీయమన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్‌ తీరును పర్యవేక్షించారు. పశ్చిమ నియోజకవర్గంలో 5751 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్ల ఉండగా బుధవారం 1595 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఇప్పటి వరకూ మొత్తం 4737 మంది ఓటు వేశారు. దీంతో 82.36 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలైన ఓట్లలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినవి 2341, జిల్లాలోని ఇతర ఆరు నియోజకవర్గాలకు సంబంధించినవి 1535, ఇతర జిల్లాలకు చెందినవి 861 ఉన్నాయి.

➡️