ప్రైవసీ

May 20,2024 05:42 #feachers, #jeevana, #katha

మల్లారెడ్డి, భాస్కర్‌రావు ఇద్దరూ స్నేహితులు. వారి పిల్లలు కూడా ఒకరికొకరుగా ఉంటారు. అయితే పిల్లల పెంపకం విషయంలో మల్లారెడ్డి కాస్త కటువుగా ప్రవర్తిస్తాడు. కొడుకు విహాన్‌ ఏ పనిచేసినా తనకు చెప్పాల్సిందేనని ఆంక్షలు పెట్టాడు. భాస్కర్‌ రావు మాత్రం అలా కాదు. తన కొడుకు కియాన్ష్‌ విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకుంటాడు. మంచి, చెడుల గురించి వివరంగా చెబుతాడు. ఎప్పుడైనా తప్పు చేసినా గట్టిగా మందలించి, మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉండాలని చెబుతాడు. మల్లారెడ్డి మాత్రం విహాన్‌ ఏ చిన్న తప్పు చేసినా చింత బరికెతో వాతలు తేలేలా కొడతాడు. ఆ దెబ్బలకు తాళలేక విహాన్‌ మొండిగా తయారయ్యాడు. నాన్నకు తెలిస్తే కొడతాడని భయపడి, అబద్దాలు చెప్పడం కూడా నేర్చుకున్నాడు. కొడుకు తన దగ్గర భయపడుతుంటే మల్లారెడ్డి లోలోన తెగ సంతోషపడేవాడు. పిల్లవాడ్ని క్రమశిక్షణలో పెంచుతున్నానని సంబరపడేవాడు.
ఒక రోజు కియాన్స్‌, విహాన్‌ని సినిమాకి వెళదామని అడిగాడు. ‘అమ్మో ఇంకేమైనా ఉందా? మా నాన్న అసలు ఒప్పుకోడు. ఇంటికి కాస్త ఆలస్యంగా వస్తేనే అదేపనిగా కొడతాడు. ఇక సినిమాకి అంటే అసలు పంపించడు’ అని చెప్పాడు. ‘అవునా! మా అమ్మా, నాన్న మా ఇంట్లో అలా ప్రవర్తించరు. మాతో చాలా స్నేహంగా ఉంటారు. మాకు తెలియని విషయాలు ఎన్నో చెబుతారు’ అని కియాన్ష్‌ చెప్పాడు. స్నేహితులిద్దరి మాటలను పక్కనే గదిలో ఉన్న భాస్కరరావు విన్నాడు. తన స్నేహితుడు మల్లారెడ్డిలో ఎలాగైనా మార్పు తేవాలని అనుకున్నాడు.
ఒక రోజు రాత్రి భోజనలయ్యాక మల్లారెడ్డిని కలిసి అలా సరదాగా బయటికి వెళదామని తీసుకెళ్లాడు. పిచ్చాపాటి మాట్లాడుతూ పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి వివరించాడు. ‘ఎదిగే పిల్లలకు కొన్ని ఇష్టాలు, కోరికలు ఉంటాయి. ప్రతి చిన్న విషయంలో మనం అడ్డుకట్ట వేయకూడదు. వయసుకు వచ్చే పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా కొన్ని కటువైన నిరయ్ణాలు తీసుకోవచ్చు. కాని ఆ నిర్ణయాలు వారి ఇష్టాలను, కోరికలను, హరించకూడదు. అలాగే ‘ఎక్కడో ఏదో జరిగిందని మన పిల్లలను మనమే నమ్మకపోతే ఎలా? ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి ప్రవర్తిస్తే మన పిల్లలే మనకు శత్రువులుగా మారుతారు. యవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లలకు, మంచి-చెడుల గురించి వివరించాలే కాని ప్రతిదాంట్లో వేలు దూర్చడం మంచి పధ్ధతి కాదు. ఆ వయసులో వారికి అనేక విషయాలు అర్థంకాక మెదడు గందరగోళంగా ఉంటుంది. ఆ సమయంలో వాళ్లకు ఆసరాగా, అండగా ఉండాలే కాని భయపెట్టకూడదు. పక్షి రెక్కలను కట్టేస్తే ఎలా ఎగురుతుంది? ఎగరడం ఎలా నేర్చు కుంటుంది? పిల్లలను ఎగరనివ్వాలి, ఎగిరే స్వేచ్చనివ్వాలి. వారి ప్రై వసీని భంగం కలిగించకూడదు. అవసరమైన మోతాదులో స్వేచ్ఛ, ప్రై వసీ పిల్లలకు తప్పకుండా ఇవ్వాల్సిందేనని స్నేహితునికి అర్థమయ్యేలా చెప్పాడు. ఆ రోజు నుండి మల్లారెడ్డి తన ప్రవర్తనను మార్చుకున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతున్నాడు.

– తక్కెడశిల.జానీ,
77595 11956.

➡️