అధ్యయనం, ఆచరణ కలగలుపే సుందరయ్య

May 19,2024 23:35

్ల సభలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య
ప్రజాశక్తి – తాడేపల్లి :
సమస్యలపై అధ్యయనం చేయడంతోపాటు వాటికి ఆచరణ రూపం కలగలుపే దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సుందరయ్య అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. సుందరయ్య 39వ వర్ధంతి సభ స్థానిక మేకా అమరారెడ్డి భవన్‌లో సిపిఎం నాయకులు వి.దుర్గారావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మానవాళికి సోషలిజం అందించడానికి సుందరయ్య పరితపించారని కొనియాడారు. ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, కూడు, గూడు వంటివి సోషలిజంలోనే సాధ్యమన్నారు. పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అటకెక్కిందని, నిరుద్యోగం ఎన్నడూ లేని విధంగా పెరిగిందని విమర్శించారు. దేశంలో నల్లధనాన్ని రూపుమాపుతామనే మాట ఆచరణరూపం దాల్చలేదన్నారు. జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు తెరిపించి ప్రతిఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలను జమ చేస్తామనే వాగ్దానాన్నీ అమలు చేయలేదని విమర్శించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోడీ దేశానికి అవసరం లేదన్నారు. రాష్ట్రంలో సిఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ప్రశ్నిస్తానని వచ్చిన పవన్‌కల్యాణ్‌ అందరూ మోడీ వద్ద మోకరిల్లారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాజధాని లేకుండా చేసిన, స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకం పెట్టిన బిజెపి ప్రభుత్వానికి ఎందుకు వీరు మద్దతిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశాన్ని రక్షించాలంటే ఎర్రజెండాకు ప్రజలు మద్దతివ్వాలన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ 70 ఏళ్ల నిష్కళంక రాజకీయ జీవితం సుందరయ్య అన్నారు. ధనిక కుటుంబంలో పుట్టినా పేదల కోసం చివరి వరకూ పోరాడిన మహోన్నతుడు సుందరయ్య అని చెప్పారు. స్వాతంత్య్రానంతరం తొలి పార్లమెంట్‌లో నెహ్రూ ప్రధానిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా సుందరయ్య పార్లమెంట్‌కే వన్నె తెచ్చారని, పార్లమెంట్‌కు సుందరయ్య సైకిల్‌పై వెళ్లి నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారని అన్నారు. నేడు చట్టసభలను నిర్వహిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటవ్వడానికి సుందరయ్య ఆద్యుడని గుర్తు చేశారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలన్నారు. సిపిఎం రూరల్‌ కార్యదర్శి డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ సాంఘిక దురాచారాలు, కుల కట్టుబాట్లకు వ్యతిరేకంగా సుందరయ్య తన ఇంటినుండే ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. సిపిఎం నాయకులు డి.శ్రీనివాసకుమారి, జి.సుబ్బారెడ్డి, వి.దుర్గారావు మాట్లాడుతూ బిజెపి విధానాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో కుల, మత చిచ్చులు పెట్టి ఆధికారం నిలుపుకోడానికి బిజెపి కుట్రలు చేస్తోందని విమర్శించారు. తొలుత వేదికపై వక్తలను వేదికపై సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు ఆహ్వానించారు. ఇదిలా ఉండగా సుందరయ్య వర్ధంతి సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌.ముత్యాలరావు, జి.శ్రీనివాసరావు, డి.విజరు, సిహెచ్‌.శ్రీరామ్‌, డి.కోదండరామయ్య, జి.అంజిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నులకపేట సుందరయ్య ప్రెస్‌కాలనీ, కెఎల్‌ రావు కాలని, సుందరయ్య నగర్‌, కొత్తూరులో సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. వి.దుర్గారావు, బి.వెంకటేశ్వర్లు, ఎ.శౌరిభర్తులోం, బి.యేషయ్య, తులశమ్మ, బి.సామ్యేలు, కె.మేరి, కె.ఉష, ఎస్‌కె.బాషా, ఎన్‌.నాగేశ్వరరావు, కొండబాబు, ఎం.వెంకటేశ్వరరావు, బి.రామారావు, డి.శ్రీనివాసకుమారి, ఎం.శ్రీనివాసరెడ్డి, డివి భాస్కర్‌రెడ్డి, బి.సుబ్బారావు, డి.యోహాను పాల్గొన్నారు.మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటమే కామ్రేడ్‌ పుచ్చలపల్లికి ఘనమైన నివాళి…వర్ధంతి సభలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌…ప్రజాశక్తి-పల్నాడు జిల్లాప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి, ప్రధాని మోడీపై పోరాటం పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి అని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ప్రకాష్‌ నగర్‌లోగల ఎన్‌జిఓ హోంల సుందరయ్య వర్ధంతి సభ సిపిఎం సీనియర్‌ నాయకులు ఎవికె దుర్గారావు అధ్యక్షతన నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించినానంతరం విజరు కుమార్‌ మాట్లాడుతూ వర్గ రహిత సమాజం కోసం సుందరయ్య పోరాడారని, ఆ ఆశయాలను కొనసాగించాలని అన్నారు. ప్రజాపోరాటాలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనస్సుల్లో సుందరయ్య చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. శ్రమను గౌరవించే సమాజం కోసం పాటుపడ్డారని, స్త్రీలను కించపరచడం, దళిత, బలహీనవర్గాలను పీడించే చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఎమెర్జెన్సీ సమయంలో ఆయన పాత్ర కీలకమన్నారు. విలువలు, త్యాగాలు, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం సుందరయ్యని కొనియాడారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతి మనిషీ సుందరయ్యలా జీవించాలని, ఆయన ఆదర్శాలను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, పట్టణ కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌, నాయకులు డి.శివకుమారి, సయ్యద్‌ రబ్బాని, బి.సలీం, హుస్సేన్‌, మస్తాన్‌వలి, రాంబాబు, సుభాష్‌ చంద్రబోస్‌, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️