మొదటి రోజే 90 శాతం పింఛన్ల పంపిణీ జరగాలి

Jun 29,2024 20:11

పాత పాస్‌ పుస్తకాల స్థానే రసీదులు

కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేద్కర్‌

ప్రజాశక్తి-విజయనగరం కోట : అత్యంత ప్రతిష్టాత్మకంగా పెంచిన పింఛన్లను ప్రభుత్వం జులై నుండి పంపిణీ చేస్తున్నందున పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఎంపిడిఒలను, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. 1వ తేదీన ఉదయం 6 గంటలకే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. మొదటి రోజునే 90 శాతం పైగా పంపిణీ జరగాలన్నారు. శనివారం కలెక్టర్‌ వెబెక్స్‌ ద్వారా పింఛన్‌ పంపిణీ ఏర్పాట్లపై ఎంపిడిఒలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 నుండి 60 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని కేటాయించామని, బయో మెట్రిక్‌ విధానం లో 7 వేల రూపాయల నగదును లబ్ధిదారుకు అందించి వారి నుండి రసీదును పొందాలని సూచించారు. పాత పింఛన్‌ పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని, అలా వినియోగిస్తే సంబంధిత ఎంపిడిఒపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కు, పంచాయతీ సెక్రటరీలకు పింఛన్‌ పంపిణీపై ఎంపిడిఒలు ప్రభుత్వ నిబంధనలు వివరించి అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కావున ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.

➡️