ఆరేళ్లుగా ‘మురుగు’తున్న నీటి శుద్ధి ప్లాంట్‌

Apr 26,2024 21:53

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం ప్రజల అవసరాలకు తగిన తాగునీటి సమస్య పరిష్కారానికి నగరంలోని పెద్ద చెరువు సుందరీకరణ తో పాటు మురికి నీటిని శుభ్రం చేసి నగర వాసులకు తాగునీరు అందించే మురుగునీటి శుద్ధి కర్మాగారం టిడిపి,వైసిపి పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూలకు చేరింది. 2018 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే మీసాల.గీత, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గా ఉన్న గంటా శ్రీనివాస రావు చేతులు మీదుగా రూ.19.92కోట్లతో మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 2018 లో ప్రారంభమైన పనులు 2024నాటికి పూర్తి కావాల్సి ఉండగా, ఆరేళ్లయినా ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉంది. ఈ ప్లాంట్‌ నిర్మాణానికి అమృత పథకం ఫేజ్‌ 2లో రూ.20 కోట్లు మంజూరు అయ్యింది. వాస్తవానికి మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మాణం చేయాలని 20ఏళ్ల నుంచి ప్రతిపాదనలు ఉన్నా నిధులు మంజూరు చేసి,గత టిడిపి హయంలో పనులు ప్రారంబించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయలేకపోయారు. తర్వాత 2019 లో వచ్చిన వైసిపి పాలకులు కనీసం ఆ వైపు చూడకపోవడంతో నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ఈ పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటి వరకు సుమారుగా ఆరు కోట్లు విలువైన పనులు జరిగాయి. ఆ పనులు చేసిన కాంట్రాక్టర్‌ కి ఆరు కోట్లు బిల్లులు కూడా చెల్లించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారం పూర్తయితే నగర వాసులకు 5 ఎం ఎల్‌ డి నీటిని అందించే అవకాశం ఉండేది. విజయనగరం ప్రజలకు తాగునీరు అందించేందుకు అందుబాటులో నదులేవీ లేకపోవడంతో దగ్గరలో ఉన్న తాటిపూడి నుంచి, నెల్లిమర్ల పథకాలు నుంచి నీటిని రప్పిస్తున్నారు. నగరంలో సుమారుగా మూడున్నర లక్షల జనాభా ఉన్నారు.ఏడాది ఏడాదికి ఈ సంఖ్య పరుగుతోంది.పెరుగుతున్న జనాభా అవసరాలు దృష్ట్యా సుమారుగా 40 ఎం ఎల్‌ డి నీరు అవసరం ఉంది. తాడిపూడి, నెల్లిమర్ల పంప్‌ హౌస్‌ల నుంచి కేవలం 16 ఎం ఎల్‌ డి నీరు మాత్రమే వస్తుంది. వేసవి వస్తే 10ఎంఎల్‌డికి పడిపోతుంది. దీంతో గత కొన్నేళ్లగా తోటపల్లి, ఆండ్ర ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని తెస్తున్నారు. ఈ రెండు నీటి ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని అందించకపోతే నగరంలో నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండేది. ఈనేపథ్యంలోనే పెద్దచెరవుఉలో మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మాణానికి అంకురార్పణ చేసినా దాన్ని పూర్తి చేయడం లో రెండు పాలకవర్గాలు నిర్లక్ష్యం చేశాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో సుమారు రూ. 250 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ అతి పెద్ద నీటి సమస్యపై దృష్టి పెట్టకపోవడంపై ప్రజలకు తాగునీటి సమస్య తప్పలేదు.

➡️