ఎన్నికలకు అన్ని విధాలా సన్నద్ధం

పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లుపై ఆరా తీస్తున్న విశాఖ రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని

ప్రజాశక్తి-అనకాపల్లి

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనకాపల్లి జిల్లాలో పోలీస్‌ శాఖ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నదని, ఈవీఎం రవాణా కొరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని విశాఖ రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనకాపల్లిలోని జీవీఎంసీ మెయిన్‌ స్కూల్‌ ఉన్న పోలింగ్‌ కేంద్రాన్ని, అనకాపల్లి మండలం రేబాక పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించారు. అక్కడ తీసుకున్న భద్రత ఏర్పాట్లు, పోలింగ్‌ బూత్‌లో వెబ్‌ కాస్టింగ్‌, లైటింగ్‌, క్యూ లైన్‌ల ఏర్పాటు తదితర విషయాలను పరిశీలించి స్థానిక పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎంలు రవాణా చేసే సమయంలో పోలింగ్‌ సిబ్బంది మీద, పోలింగ్‌ సమయంలోనూ ఎవరైనా గొడవలు చేస్తే వారి మీద తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉండటం వలన ఐదుగురుకు మించి ఎవరు గుంపులుగా తిరగరాదని స్పష్టం చేశారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా ఇంకెవరూ ఉండకుండా చూడాలన్నారు. 200 మీటర్ల దూరంలోనే ఓటర్ల వాహనాలు నిలిపివేయాలని, ఓటు హక్కు వినియోగించుకునే వారు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి వాహనాలను మాత్రమే అనుమతించబడతాయని, అవి కూడా ఆర్వో అనుమతి పొందిన మూడు వాహనాలు మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. వాహనాలలో ఐదుగురకు మించి ఉండరాదన్నారు. ఓటింగ్‌ జరుగుతున్న విధానాన్ని పరిశీలించేందుకు అభ్యర్థిని మాత్రమే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించడం జరుగు తుందన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూట్‌ మొబైల్‌, క్యూ ఆర్‌ టి టీమ్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లను ఏర్పాటు చేశామని వీరి సమన్వయంతో పనిచేస్తూ అన్ని ప్రాంతాలను కవర్‌ చేసేలాగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మద్యం, నగదు, ఇతర ఆకర్షకాలను పంపిణీ చేస్తుంటే సి విజిల్‌ యాప్‌ ద్వారా గాని లేదా నేరుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు గాని తెలియాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణ, అనకాపల్లి సబ్‌ డివిజన్‌ డిఎస్పీ అప్పలరాజు, అనకాపల్లి టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️