గిరిజనులకు మెరుగైన వైద్యం

రోగుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్‌ )ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, బోధనా అసుపత్రి అనుమతుల జారీ చేయడానికి రెండు రోజుల క్రితం నేషనల్‌ కౌన్సిల్‌ బృందం పరిశీలించిందన్నారు. జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా అప్‌ గ్రేడ్‌ చేసి 120 పడకల నుండి 420 పడకలకు పెంచడం జరిగిందన్నారు. రెండు అంతస్తులను కార్పోరేట్‌ స్థాయిలో నిర్మించారని, మంచి నాణ్యత, ఉన్నత స్థాయిలో వైద్య సదుపాయాలు అందనున్నాని తెలిపారు. ఆపరేషన్‌ ధియేటర్‌కు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాలని సూపరింటెండెంట్‌ కోరారని, ఆ దిశగా ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తామన్నారు. మంజూరైన పోస్టుల సంఖ్యలో ముప్పై శాతం మంది మాత్రమే ఉన్నారని, ఖాళీలు భర్తీ చేయడానికి రీజనల్‌ డైరెక్టర్‌ ను కోరతామన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేందుకు వైద్యులు ముందుకు రాలేదని అదనపు ఇన్సెంటివ్‌ ఇచ్చి నియమిస్తామన్నారు. తాగునీటి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ అధికారులు (సి.హెచ్‌.ఓలు) క్యాన్సర్‌ డైగ్నోసిస్‌ శిక్షణ పొందుతున్నారని చెప్పారు. ఎక్సరే, సిటి స్కాన్‌ సేవలు నిరంతరం అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ విశ్వామిత్ర, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ హైమావతి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండల రావు, తహశీల్దార్‌ కల్యాణ చక్రవర్తి, ఎంపిడిఓ సాయి నవీన్‌, ఎటిడబ్ల్యూఓ ఎల్‌.రజని, ఆసుపత్రి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.వైద్యకళాశాల పనులను తనిఖీ 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ శనివారం పరిశీలించారు. వైద్య విద్యార్ధుల తరగతి గదులు, ల్యాబ్‌ రేటరీలు, బాలురు, బాలికల వసతి గృహాలు, బోధనా తరగతి గదులు నర్సింగ్‌ కళాశాల భవనాల నిర్మాణాలను తనిఖీ చేశారు. భవన నిర్మాణాలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, ఏ అవసరం వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని సూచించారు. పనులు నిర్దిష్టమైన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పటిష్టమైన నాణ్యతలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ హైమావతి, తహశీల్దార్‌ కల్యాణ చక్రవర్తి, ఎంపిడిఓ సాయి నవీన్‌ పాల్గొన్నారు.

➡️