ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలి

ప్రజాశక్తి-పాడేరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అరకు పార్లమెంటు నియోజక వర్గం సాదారణ పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ సూచించారు. మన్యం పార్వతీ పురం కలెక్టరేట్‌ నుండి జిల్లా ఎన్నికల అధికారులు, సాలూరు, కురుపాం, పాలకొండ పాడేరు, అరకువ్యాలీ, రంపచోడవరం, పార్వతీపురం నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీల అభ్యర్ధులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీల అభ్యర్ధులు, ఏజెంట్ల సహకారంతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. రెండవ ర్యాండమైజేషన్‌ పూర్తి చేసారని బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు నంబర్లును సరిచూసుకోవాలని చెప్పారు. శాంతి భద్రతలను సమర్దవంతంగా అమలు చేయాలని స్పష్టం చేసారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్ధులు బ్యాంకు చెక్కులు, ఆర్‌టిజిఎస్‌ ద్వారా చెల్లింపులు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఘర్షణలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత మాట్లాడుతూ, పోలింగ్‌ కేంద్రాలను వేరే ప్రాంతాలకు తరలించిన గ్రామాలలో ఓటర్లకు ఓటు హక్కు వినియోగించు కోవడానికి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసామని చెప్పారు.జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించడానికి తగిన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి జాయింట్‌ కలెక్టర్‌ భావనా పశిష్ట. అరకు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి వి.అభిషేక్‌, డి. ఆర్‌.ఓ, బి.పద్మాపతి, సిపిఎం అభ్యర్ది పాచిపెంట అప్పల నర్స, భారత్‌ ఆదివాసీ పార్టీ అభ్యర్థి ఎం.రాజబాబు, స్వతంత్ర అభ్యర్థి ఎస్‌.బాలకృష్ణ పాల్గొన్నారు.

➡️