సాగు భూముల జోలికి వస్తే తరిమికొడతాం

ఆయుధాలతో నినాదాలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి -అనంతగిరి:తాత ముత్తాతల కాలం నుండి సాగులో ఉన్న తమ భూముల జోలికి వస్తే తరిమి కొడతామని ఆర్మీ మాజీ సైనికులు తక్షణమే వెనక్కి వెళ్లి పోవాలని గిరిజనులు సాంప్రదాయ ఆయుధాలు చేతిలో పట్టుకుని శనివారం సాగు భూమి వద్ద ఆందోళన చేపట్టారు. సాగు భూముల జోలికి వస్తే తరిమి కొడతాం గో బ్యాక్‌ మాజీ సైనికులు.. సాగులోనున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. మండలంలోని నాన్‌ షెడ్యూల్‌ గరుగుబిల్లి పంచాయతీ పరిధి సింగవరం గ్రామానికి చెందిన వార్డ్‌ మెంబర్‌ ఎరకన్న దొర, .గ్రామ పెద్దలు కె.పోలన్నదొర, కె.పోతన్నదొరలు మాట్లాడుతూ, తాత ముత్తాతల కాలం నుండి భూమిని నమ్ముకుని వివిధ రకాల వ్యవసాయ పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. సర్వే నెంబర్‌ 22 లో సుమారు 160 ఎకరాలలో 70 మంది రైతులు సాగు చేస్తున్నామని, తాము సాగులో ఉన్న భూమిని మాజీ సైనికులకు పట్టాలు మంజూరు చేశామని సంబంధిత రెవిన్యూ శాఖ అధికారులు, మరోపక్క ఫారెస్ట్‌ ఉన్నత అధికారులు భూమి ఖాళీ చేయమని లేకుంటే కేసులు బనాయిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.ఈ భూమి తప్ప మరో ఆధారం తమకు లేదని సంబంధిత అధికారులు పున్ణరాలోచించి సాగులో ఉన్న 70 మంది రైతులకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఓట్లు వేసి గెలిపించిన ఎంపీటీసీ, సర్పంచులు తమ పక్షాన అండగా నిలవాల్సింది పోయి మాజీ సైనికుల వైపు ఉండటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే రెవిన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయాలని, మాజీ సైనికులు వెనక్కి వెళ్లిపోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాగు రైతులు జమ్మనదొర, పి.పోతన్నదొర, కె.రామన్నదొర, , ప్రసన్నదొర పాల్గొన్నారు.

➡️