అధ్వాన రోడ్లతో అవస్థలు

గోతులమయమైన మార్గంలో వెళుతున్న వాహనాలు

ప్రజాశక్తి-అరకులోయ:అరకులోయ కేంద్రం నడిబొడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు, పద్మాపురం ఉద్యానవన కేంద్రం రోడ్డు పరిశీలిస్తే ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్‌ జంక్షన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌, పర్యాటక శాఖ మయూరి అతిథి గృహానికి వెళ్లే రహదారి పూర్తిగా మరమ్మతుకు గురై గోతులమయమై చెరువును తలపిస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం స్పందించ లేదు.సుమారుగా మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రోడ్డు మరమ్మతుకు గురై పూర్తిగా గోతులమయం కావడంతో ఇటు స్థానికులకు, అటు పర్యాటకులకు, వానచోదలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. చిన్నపాటి వర్షం కురిసినా వాహన చోదకులు ఈ రోడ్డు లో ప్రయాణం చేయాలంటే నానా అవస్థలు పడవలసిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం అరకులోయ ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో వర్షపు నీటితో నిండి చెరువును తలపిస్తూ అస్తవ్యస్తంగా మారింది. దీంతో, నిత్యం ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే నరకాయతను పడాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు మార్గంలోనే పర్యాటకశాఖ మయూరి అతిథి గృహం, ఐటిడిఏ గోస్తాని ( వీఐపీ) అతిథి గృహాలకు రాకపోకలు సాగించే ఏ అధికారులు కూడా ఈ రోడ్డు మరమత్తుపై దృష్టి సారించ లేదు. నిరంతరం ఉన్నత స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు మయూరి అతిథి గృహంలోనే బస చేస్తున్నారు. అయినా ఈ రోడ్డుకు మోక్షం మాత్రం కలగలేదు. దశాబ్దం క్రితం అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ అరకులోయలో సందర్శించినప్పుడు అధికార యంత్రాంగం రాత్రికి రాత్రి నామమాత్రంగా పైపైన రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. మళ్లీ ఆ రోడ్డు నెలరోజులు తిరక్క ముందే యథాస్థితికి చేరుకోవడంతో ప్రయాణికులకు, వాహన చోదకులకు మళ్లీ పూర్వ స్థితి నెలకొంది. ఈ రోడ్డును మరమ్మత్తు చేసి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చి పూర్వ వైభవం కల్పించాలని స్థానికులు, పర్యాటకులు, మోటార్‌ యూనియన్‌ ప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు అరకులోయను సందర్శించిన ఉన్నతాధికారులకు, మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోయింది.పర్యాటక సందర్శిత ప్రాంతమైన పద్మావతి ఉద్యానవనం కేంద్రానికి వెళ్లే రోడ్డు కూడా పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకొని గోతులమయమైంది. దీంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుని వెంటనే మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తేవాలని స్థానికులు, పర్యాటకులు డిమాండ్‌ చేశారు. వర్షాకాలం సమీపించడంతో వాహన చోదకులు, పర్యాటకులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

➡️