ఎన్నికల సిబ్బందికి అసౌకర్యం లేకుండా చర్యలు

ప్రజాశక్తి-పాడేరు : ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.వివేకానందన్‌, కలక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.విజయ సునీత ఆదేశించారు. శనివారం ప్రభుత్వ కళాశాల మైదానంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కలక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి పంపిణీలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్‌ ప్రూఫ్‌ షామియానా ఏర్పాటు చేయాలని, అవసరమైన ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల సామగ్రి సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాలకు సకాలంలో చేరుకొనే విధంగా అవసరమైన రవాణా సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల సామాగ్రి తీసుకువెళ్ళేందుకు అవసరమైన రక్షిత బ్యాగులు కూడా అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పంపిణీ కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా లైటింగ్‌, సిసి కెమేరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.పద్మావతి, స్థానిక తహసిల్దార్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ, డివిఆర్‌ఎం రాజు, డిఇఇ అనుదీప్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️