కౌంటింగ్‌ ఏర్పాట్లు వేగవంతం చేయండి

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, జెసి, పిఒ

ప్రజాశక్తి- పాడేరు:కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములను, కౌంటింగ్‌ హాల్స్‌ను పాడేరు రిటర్నింగ్‌ అధికారి, జేసి భావన వశిస్ట్‌, ఎస్పి తుహిన్‌ సిన్హా తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌ హాల్స్‌ ను సందర్శించి పలు సూచనలు జారీ చేసారు. పోలింగ్‌ ఏజంట్లకు ఏర్పాటు చేస్తున్న ఐరన్‌ మెస్‌ పనులు పూర్తి చేసి, సిసి కెమెరాలు వినియోగంలోకి తీసుకు రావాలని, ప్రతి హాలులో 14 కౌంటింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రదేశంలోను అవసరమైన లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి కదిలకను సిసి కెమారాల్లో రికార్డు అయ్యే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇప్పటికే సంబంధిత అధికారులందరికీ కౌంటింగ్‌పై అవగాహన కల్పించామని, సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణలు ఇస్తున్నామని తెలిపారు. కౌంటింగ్‌ జరిగే కళాశాల ప్రాంతం బహిరంగ రహదారి ఉన్నందున మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న భవనంలో మీడియా కేంద్రం ఏర్పాటుకు రూములను పరిశీలించి తగు సూచనలు జారీచేసారు. ఎస్పి తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ, స్ట్రాంగ్‌ రూముల భద్రతకు 75మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. రంపచోడవరం కేంద్రం వద్ద డిఎస్పి ర్యాంకు అధికారి పర్యవేక్షిస్తున్నారన్నారు. కౌంటింగ్‌కు మూడంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేసామని, స్థానిక పోలీసు, ఎపిఎస్పితో పాటు కేంద్ర పోలీసు వ్యవస్థ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపించడం జరుగుతుందని, మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ డివైస్‌లు లోనికి అనుమతి లేదని స్పష్టం చేసారు. ముందుగా పాడేరు నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి జేసి భావన వశిస్ట్‌, అరకు వ్యాలీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి వి.అభిషేక్‌ వేరువేరుగా స్ట్రాంగ్‌ రూములను సందర్శించి లాగ్‌ బుక్‌లో సంతకాలు చేసారు. ఈ కార్యక్రమలో డిఆర్‌ఓ బి.పద్మావతి, గిరిజన సంక్షేమ ఇఇ డివిఆర్‌ ఎం.రాజు, డిఇఇ అనుదీప్‌, స్థానిక తహసిల్దార్‌ కళ్యాణ చక్రవర్తి, డిపిఆర్‌ఒ పి.గోవింద రాజులు, ఇతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️