అసెంబ్లీ ఎన్నికల్లో ‘మెట్టు’ ఓటమి ఖాయం

అసెంబ్లీ ఎన్నికల్లో 'మెట్టు' ఓటమి ఖాయం

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ విప్‌ కాపు రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-రాయదుర్గం

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఓడిపోవడం ఖాయమని మాజీ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రాయదుర్గంలో మీడియాతో మాట్లాడుతూ తాను 15ఏళ్లుగా వైసిపి ఏర్పడినప్పటి నుంచి రాయదుర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లానన్నారు. ఇక్కడ పార్టీ పునాది ఏర్పడింది తనతోనే అన్నారు. నేడు తానులేని వైసిపి కొత్తగా ఉందన్నారు. మెట్టు గోవిందరెడ్డి ‘తల కింద.. కాళ్లు పైకి’ చేసి తపస్సు చేసినా రాయదుర్గంలో గెలిచే అవకాశం లేదన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా మెట్టు గోవిందరెడ్డి తాను ఒక్క ఓటుతోనైనా గెలుస్తానని చెప్పి 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు. ఇప్పుడు కూడా మెట్టు ఒక్క ఓటుతోనైనా తాను గెలుస్తానని చెబుతున్నాడని, అయితే 15 నుంచి 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమన్నారు. టిడిపి తరపున ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేసి తాడిపత్రి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, మున్సిపల్‌ వార్డు సభ్యుల ఓట్లను డబ్బిచ్చి కొన్నారన్నారు. ఇది రాజకీయ వ్యభిచారం అన్నారు. దీన్ని సమర్థత అనరని, నీచమైన రాజకీయం అంటారని ఎద్దేవా చేశారు. గోవిందరెడ్డికి ఏం మాట్లాడాలో తెలియదన్నారు. ఎపిఐఐసి ఛైర్‌పర్సన్‌ పదవి చాలా గొప్పదన్నారు. ఆ పదవి వల్ల రాయదుర్గానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. చేతకాని వాళ్లు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటారన్నారు. మున్ముందు మెట్టు గోవిందరెడ్డి గురించి మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయని, త్వరలో చెబుతానన్నారు.

➡️