క్రమశిక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు

క్రికెటర్‌ అంబటి రాయుడును సన్మానిస్తున్న ఆలూరు సాంబశివారెడ్డి

 

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్‌ సాధ్యమని క్రికెటర్‌ అంబటి రాయుడు పిలుపునిచ్చారు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటి ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం స్వాగతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంబటి రాయుడుకు ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముసలమ్మ కట్ట వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి యువ నాయకుడు ఆలూరు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల వరకూ భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కళాశాలకు చేరుకున్న అంబటిరాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఎస్‌ఆర్‌ఐటి కళాశాల కరస్పాండెంట్‌ ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల యాజమాన్యం కల్పించే వివిధ సదుపాయాలను సక్రమంగా వినియోగించుకుంటూ, విద్యాపరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. ఈకార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

➡️