త్వరితగతిన ఎన్నికల ఏర్పాట్లు : కలెక్టర్‌

ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

           అనంతపురం : ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్‌ రూం. కౌంటింగ్‌ కేంద్రాలు ఇతర అన్నింటికి సంబంధించి ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. అనంతపురం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాలలో సాధారణ ఎన్నికల కోసం శింగనమల నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. అనంతరం నగరంలోని జూనియర్‌ కళాశాలలో అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనంతపురం, శింగనమల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, ఈవీఎంల కమిషనింగ్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ల కోసం ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం ఏర్పాట్ల విషయమై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్‌ఒ జి.వెంకటేష్‌, శింగనమల ఆర్‌ఒ వెన్నెల శ్రీను, తహశీల్దార్‌ శివరామిరెడ్డి, డివిఈవో వెంకటరమణ నాయక్‌, జూనియర్‌ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ సిద్ధేశ్వర ప్రసాద్‌, ఈఆర్‌ఒలు, ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️