పంచాయతీరాజ్‌లో సిమెంట్‌ గోల్‌మాల్‌

పంచాయతీరాజ్‌ డీఈ రాజన్నను నిలదీస్తున్న కాంట్రాక్టర్లు

      కుందుర్పి : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మంజూరు చేసిన సిమెంట్‌ వినియోగంలో కుందుర్పి మండల పంచాయతీ రాజ్‌ అధికారులు పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ చేశారనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. కుందుర్పి మండల వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ఇదే సమయంలో నిర్మాణ పనులకు సంబంధించి వచ్చిన సిమెంట్‌ బస్తాలను పంచాయతీరాజ్‌ అధికారులు పక్కదారి పట్టించారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇలా మండల వ్యాప్తంగా దాదాపు 30 నుంచి 40 వేల దాకా సిమెంట్‌ బస్తాల గోల్‌మాల్‌ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై కాంట్రాక్టర్లు బహిరంగంగా అధికారులపై విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం మండలంలో పర్యటించిన ఎంపీ తలారి రంగయ్య దృష్టికి కాంట్రాక్టర్లు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీ పంచాయతీ రాజ్‌ డిఈ రాజన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్‌ బస్తాలకు సంబంధించి ఎలాంటి గోల్‌మాల్‌ జరగలేదని పంచాయతీరాజ్‌ అధికారులు, జరిగిదంటూ కాంట్రాక్టర్లు ఎంపీ సమక్షంలోనే వాదులాడుకున్నారు. మండల వ్యాప్తంగా చూస్తే 13 గ్రామ పంచాయతీల పరిధిలో 16 సచివాలయాలు, ఆర్‌బికె భవన నిర్మాణాలు ప్రారంభం అవగా ఇందులో కేవలం మూడు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన వాటి నిర్మాణాలు అన్నీ వివిధ స్థాయిల్లోనే నిలిచిపోయాయి. భవన నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరగనప్పుడు సిమెంట్‌ బస్తాలు ఎక్కడికి వెళ్లాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సిమెంట్‌ గోల్‌మాల్‌పై జిల్లా ఉన్నాతాధికారులు స్పందించి విచారణ జరిపిస్తే అవినీతి వాస్తవాలు బహిర్గతం అవుతాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

➡️