పామిడి పంచాయతీలో ‘ఉపాధి’ పనులు కల్పించాలి

ఎంపిడిఒ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎపి వ్య.కా.సం నాయకులు

ప్రజాశక్తి-పామిడి

పామిడి పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామిడిని కరువు మండలంగా ప్రకటించినా అందుకు తగ్గ సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. మండల వ్యాప్తంగా గ్రామాల నుంచి వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారన్నారు. ముఖ్యంగా పామిడి, కొండాపురం, కొత్తపల్లి గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా పనులు లేక వ్యవసాయ కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వలసలను నివారించడానికి మండలంలో అదనపు పనిదినాలతో కరువు పనులు చేపట్టాలన్నారు. అదేవిధంగా కరువు ప్రాంతాల్లో వంద రోజుల ప దినాలతో పాటు అదనంగా 50 రోజులు పనిదినాలు కల్పించాలన్నారు. అలాగే చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకానికి నిధులు, పనులు, వేతనాల్లో కోత పెట్టిందన్నారు. ఫలితంగా వ్యవసాయ కూలీలకు పొట్టపోసుకోవడం గగనంగా మారిందన్నారు. కావున కరువు సహాయక చర్యల్లో భాగంగా కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలు, ఈశ్వరయ్య, పార్వతి, ఓబులమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️