బకాయిలను చెల్లించాలి

Jan 3,2024 22:36

యుటిఎఫ్‌ 12గంటల నిరసన దీక్షలో ప్రసంగిస్తున్న డా||గేయానంద్‌ఆర్థిక

         అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్‌ల సమస్యల పరిష్కారం కోరుతూ అనంతపురం కలెక్టరేట్‌ వద్ద 12గంటల పోరుబాట ధర్నా నిర్వహించారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు గోవిందరాజులు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర సంపద ఉత్పత్తి రూ.15 లక్షల కోట్లు ఉన్నప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించలేక ఉన్న ఆదాయ వనరులను కార్పొరేట్‌ వ్యక్తులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం అన్యాయంగా ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాల ద్వారానే ఏదైనా సాధిస్తారని, పైరవీల ద్వారా కాదన్నారు. సిపిఎస్‌, జిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ అనే నినాదంతో యుటిఎఫ్‌ చేసే అన్ని పోరాటాలకు తన మద్దతు ఉంటుందని తెలియజేశారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలన్నారు. 2 సంవత్సరాలుగా 1వ తేదీన వేతనాలు అందని దుస్థితి ఏర్పడిందన్నారు. 15వ తేదీ వరకు కూడా చాలా మందికి జీతాలు చెల్లించడం లేదన్నారు. పిఆర్‌సి అరియర్లు, పిఆర్‌సి ముందు కాలం నాటి డీఏ అరియర్లు, కొత్తగా మంజూరు చేసిన రెండు డీఏ అరియర్లు, పిఎఫ్‌ లోన్లు పార్ట్‌ ఫైనల్‌ లోన్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ జనవరి 9,10వ తేదీలలో విజయవాడ నందు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 36 గంటల ధర్నా చేపడతామని హెచ్చరించారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ ప్రసూన, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజనమ్మ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ధర్నా కార్యక్రమానికి కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, సిఐటియు రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌, సిఐటియు నాయకులు ఆర్‌వి.నాయుడు, వి.రామిరెడ్డి, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ శ్రీనివాసులు, రాఘవేంద్ర, ఆర్‌యుపిపి నాయకులు తులసిరెడ్డి, ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, సుధాకర్‌ మద్దతుగా హారయ్యారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య, సహాధ్యక్షులు రామప్ప, కోశాధికారి రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, రాష్ట్ర కౌన్సిలర్‌ ఈశ్వరయ్య, సీనియర్‌ నాయకులు మహమ్మద్‌ జిలాన్‌, నాగేంద్ర, కార్యదర్శులు హనుమంతు రెడ్డి, ప్రమీల, రఘురామయ్య, సంజీవ్‌ కుమార్‌, రవికుమార్‌, శేఖర్‌, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️