మున్సిపల్‌ కార్మికుల కలెక్టరేట్‌ ముట్టడి

Jan 9,2024 10:06

కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో మాట్లాడుతున్న వి.రాంభూపాల్‌

               అనంతపురం కలెక్టరేట్‌ : సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మరింత ఉధృతం అయ్యింది. సోమవారం నాడు జిల్లాలోని కార్మికులు అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అన్ని మున్సిపాల్టీల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఇందులో పాల్గొన్నారు. సంగమేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడ బైటాయించి మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక సమయంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్మికులు కిందపడ్డారు. సమస్యలను పరిష్కరించమే ప్రభుత్వం ఇలా పోలీసులతో అడ్డగింతలు చేయడంపై కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ఆందోళనకు సిపిఎం, సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నాడు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌ గేటు ఎదుట రోడ్డుపై బైటాయించి తమను రెగ్యులరైజ్‌ చేసి, కనీస వేతనాలు చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌.నాగేంద్రకుమార్‌, సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు తదితరులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు లేకుండా ప్రభుత్వం పాలనను నడవగలదా అంటూ ప్రశ్నించారు. 14 రోజులుగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించుకుండా ప్రభుత్వం పట్టీపట్టనట్లు ఉందన్నారు. చర్చల పేరుతో ఏ ఒక్క డిమాండ్‌ను అమలు చేయకుండా సమ్మె విరమింపజేయాలని చూడటం సరికాదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్మికులు అడుగుతున్నది న్యాయమైన కోర్కొలే అని గొంతెమ్మ కోర్కొలేమి కాదన్నారు. తక్షణమే కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వానికి సాగనంపడం ఖాయమన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ నాయకులు ఎర్రిస్వామి, తిరుమలేష్‌, ఆంజనేయులు, మల్లికార్జున, రాయుడు, వన్నూరప్ప, జగదీష్‌, వరలక్ష్మి, ఓబుళపతి, సిఐటియు నగర కార్యదర్శి ముత్తుజా, నగర అధ్యక్షులు శ్రీనివాసులు, ఆటో యూనియన్‌ నాయకులు ఆది, ఆజాంబాషా తదితరులు పాల్గొన్నారు.

➡️