విజ్ఞాన సమాజాన్ని నిర్మిద్దాం

జెవివి రాష్ట్ర స్థాయి సైన్స్‌ కళాయాత్రల ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఎస్‌కెయు రిజిస్ట్రార్‌ ఎంవి.లక్ష్మయ్య

          అనంతపురం కలెక్టరేట్‌ : మూఢనమ్మకాలను పారదోలి విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించుకునేలా అందరం కృషి చేయాలని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఎంవి.లక్ష్మయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన శ్రీకాకుళంలో ప్రారంభించిన జెవివి రాష్ట్ర స్థాయి సైన్స్‌ కళాయాత్రలు శనివారం అనంతపురంలో ముగిశాయి. అనంతపురం జిల్లా కేంద్రంలోని కెఎస్‌ఎన్‌ డిగ్రీ మహిళా కళాశాలలో జెవివి గౌరవాధ్యక్షురాలు డాక్టర్‌ ప్రసూన అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్‌ కళాప్రదర్శనలకు ఎస్‌కెయు రిజిస్ట్రార్‌ ఎంవి.లక్ష్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికి జెవివి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. జెవివి వంటి సంస్థలు ఇతర దేశాల్లో లేవని, అక్కడ మూఢనమ్మకాలు లేకపోవడమే ఇందుకు కారణం అన్నారు. జెవివి రాష్ట్ర గౌరవాధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జెవివి ఆవిర్భావం నుంచి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తోందన్నారు. విద్యార్థులు సైన్స్‌ పాఠాలు తరగతి గదులకే పరిమితం అవుతున్న నేపథ్యంలో జీవితంలో కూడా సైన్స్‌ భావాలను అనువదించుకుని విజ్ఞానవంతులుగా ఎదగాలన్నదే జెవివి లక్ష్యం అన్నారు. ప్రకృతి సహజ సిద్ధంగా సైన్స్‌లో భాగంగా మానవాళికి అందినదే అన్నారు. సమాజంలో విజ్ఞానం కంటే అజ్ఞానమే ఎక్కువ ప్రభావం చూపుతోందన్నారు. అందుకే నేటి విద్యార్థులు విజ్ఞానవంతులై స్వచ్చమైన శాస్త్రీయ సమాజాన్ని నిర్మించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. ఐఎంఎ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ సైన్స్‌ సమాజ గతిని, స్థితిని మార్చి అభివృద్ధి వైపు నడిపిస్తుందన్నారు. విద్యార్థులు సైన్స్‌భావాలను అలవర్చుకోవాలన్నారు. అనంతరం జెవివి బృందం ప్రదర్శించిన సైన్స్‌ కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళా విద్యాభ్యాసం ప్రాముఖ్యత, మూఢనమ్మాకాల నిర్మూలన, ప్రశ్నించేతత్వం ప్రదర్శన, పర్యావరన పరిరక్షణ, మహిమలు, మంత్రాలు లేవంటూ ప్రదర్శించిన ప్రదర్శనలు విద్యార్థులను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, జెవివి రాష్ట్ర స్థాయి సైన్స్‌ కళాజాత కన్వీనర్‌ త్రిమూర్తులు, మాజీ కార్యదర్శి, విశ్రాంత అధ్యాపకులు మురళీధర్‌, కెఎస్‌ఎన్‌ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ శంకరయ్య, మానవత తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి, డాక్టర్‌ వీరభద్రయ్య, డాక్టర్‌ రంగన్న, పెన్షనర్‌ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప, జెవివి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరామిరెడ్డి, కె.లక్ష్మినారాయణ, సీనియర్‌ నాయకులు భాస్కర్‌, నగర అధ్యక్ష కార్యదర్శులు రామిరెడ్డి, వీరరాజు, నాయకులు గాంగే నాయక్‌, లక్ష్మినారాయణ, ప్రసాద్‌, చిత్తప్ప, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య, గౌరవాధ్యక్షులు రమణయ్య, సీనియర్‌ నాయకులు జిలాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️