వేతనాలకోసం తాగునీటి కార్మికుల ఆందోళన

పంప్‌హౌస్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

        కళ్యాణదుర్గం : వేతనాల కోసం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇదివరకే వేతనాలు చెల్లించాలని మూడుసార్లు నిరవధిక సమ్మె చేపట్టారు. ఒకానొక దశలో వైసిపి నాయకులు ఆందోళన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంపీ తలారి రంగయ్య జోక్యం చేసుకున్నప్పటికీ సకాలంలో వేతనాలు అందలేదు. హామీ ఇచ్చినా వేతనాలు ఇవ్వకపోవడంతో సోమవారం నాడు పంప్‌హౌస్‌ వద్ద ఆందోళన చేపట్టారు. మోటార్లను ఆఫ్‌ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి సరఫరా కోసం నిరంతరం కష్టపడుతున్న కార్మికులకు వేతనాలు చెల్లించకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని కార్మికులు ప్రశ్నించారు. ఐదేళ్లుగా వేతనాలు అందక కష్టాలు పడుతున్నామన్నారు. ఒక నెల కూడా సక్రమంగా వేతనాలు చెల్లించిన దాఖలు లేవని మండిపడ్డారు. కాంట్రాక్టర్‌, ఎంపీ రంగయ్య ఇచ్చిన హామీ కూడా నీటి మూటలుగా మారాయని విమర్శించారు. తక్షణమే వేతనాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మె ప్రకటిస్తామన్నారు. ఈకార్యక్రమంలో తాగునీటి పథకం కార్మికులు పాల్గొన్నారు.

➡️