అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం..!

ప్రచారం చేస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : ‘ప్రజలు, కార్మికులు, కర్షకుల పక్షాన నిత్యం పోరాడుతున్నాం, కష్ట జీవుల బాగుకోసమే ప్రశ్నిస్తూ వచ్చాం. ఎన్నికల్లో ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటి చేసి చూపిస్తాం’. అంటూ ఇండియా వేదిక సిపిఐ అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సి.జాఫర్‌ తెలిపారు. బుధవారం సిపిఐ, సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని రైల్వేస్టేషన్‌ వద్ద టిటిడి కళ్యాణమండపం నుంచి ప్రచారం ప్రారంభించారు. తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, దుకాణుదారులతో బ్యాలెట్‌ నమూనా, మ్యానిపెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తూ అసెంబ్లీ స్థానానికి కంకి కొడవలి గుర్తు, పార్లమెంట్‌ స్థానానికి హస్తం గుర్తుకు రెండు ఓట్లు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జాఫర్‌తో పాటు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌లు సిపిఎం, సిపిఐ నేతలు లైన్‌కొట్టాలు, హెచ్‌ఎల్‌సి కాలనీ, అరుణోదయ కాలనీ, గంగా నగర్‌, జానకిరామ్‌ నగర్‌, ఇందిరా నగర్‌లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్‌ మాట్లాడుతూ వామపక్ష పార్టీలుగా తాము నిత్యం ప్రజల పక్షానే పోరాటాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టలు తెలిసిన వ్యక్తి జాఫర్‌ అన్నారు. గెలిపించి అసెంబ్లీకి పంపడం ద్వారా ప్రజాగళంగా నిలుస్తాడని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లికార్జునకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వామపక్ష పార్టీల పోరాటాలతోనే ఇళ్ల స్థలాలు, ఇళ్లు, సాధించుకున్నామని, అలాంటి పార్టీ వ్యక్తులు చట్టసభల్లో ఉంటే పేదలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.నాగేంద్రకుమార్‌, బాలరంగయ్య, వి.రామిరెడ్డి, వెంకటనారాయణ, వలీ, ప్రకాష్‌రెడ్డి, రాజీవ్‌ కాలనీ ఉప సర్పంచి మసూద్‌, ఏజీ.రాజమోహన్‌, సిపిఎం నాయకులు వెంకటేష్‌, జీవా, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా నాయకులు అల్లీపీరా, రమణయ్య, ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️