నెలగొండ అతిసార బాధితులకు వైద్య చికిత్సలు

ఆసుపత్రిలో చికత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్న సిపిఎం నాయకులు

      గుంతకల్లు రూరల్‌ : గుంతకల్లు మండల పరిధిలోని నెలగొండ గ్రామంలో విజృంభించిన అతిసారపై వైద్యాధికారులు స్పందించారు. గ్రామానికి చెందిన 22 మంది రెండు రోజుల కిందట అతిసారా లక్షణాలైన వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు దీనిపై స్పందించారు. చికిత్సల నిమిత్తం వచ్చిన వారికి గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు చేశారు. గ్రామంలో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వెంటనే ఆసుపత్రికి రావాలని వైద్యులు గ్రామస్తులకు సూచించారు. నాగసముద్రం పిహెచ్‌సిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పరామర్శించారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పరామర్శించిన వారిలో సర్పంచి పాటిల్‌ భాగ్యమ్మ, ఎంపీడీవో శ్రీకాంత్‌ చౌదరి, ఈవోఆర్డీ శివాజీ రెడ్డిలు ఉన్నారు.

బాధితులకు సిపిఎం పరామర్శ

     మండల పరిధిలోని నెలగొండ గ్రామంలో వైద్య అధికారులు తక్షణమే పర్యటించి యుద్ధ ప్రాతిదికన వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. కలుషిత నీరుతాగి అస్వస్థతకు గురై గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సల పొందుతున్న నెలగొండ గ్రామస్తులను సిపిఎం బందం మంగవారం పరామర్శించింది. అస్వస్థతకు గల కారణాలను బాధితులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మంచి నీటి పైపులైన్‌ డ్రెయినేజీ మీదుగా ఉండటం వల్ల కొన్నిచోట్ల లీకై కలుషిత నీరు సరఫరా అయ్యిందన్నారు. గ్రామంలో నీటి ట్యాంక్‌ సరిగా శుభ్రం చేయడం లేదన్నారు. ఈ కారణాలతోనే 28 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. నెలగొండ గ్రామానికి వెళ్లి అస్వస్థతకు గల కారణాలను పరిశీలించి నివారణ చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. మూడు రోజుల పాటు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జయవర్ధన రెడ్డిని కోరారు.

➡️