కట్టుదిట్టంగా భద్రత

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

         అనంతపురం కలెక్టరేట్‌ : సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా కౌంటింగ్‌ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని జెఎన్‌టియులో సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ కోసం అన్ని విధాల సన్నద్ధంగా ఉండాలన్నారు. ఇందుకోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో బ్యారికేడింగ్‌ పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో బందోబస్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వెంటనే ట్రాఫిక్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద రెయిన్‌ ప్రూఫింగ్‌ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేసుకుని కౌంటింగ్‌ కోసం సర్వం సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జెఎన్‌టియులోని స్ట్రాంగ్‌ రూముల వద్ద చేపట్టిన ఏర్పాట్లను చూసేందుకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కోసం జేఎన్టీయూలో ప్రత్యేకంగా గది ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జెఎన్‌టియులోని హంపి హాస్టల్‌లో అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశామన్నారు. అందులో ప్రత్యేకంగా టీవీలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, నోడల్‌ అధికారులు ఓబుల్‌ రెడ్డి, అప్పాజీ, డీఎస్పీలు ప్రతాప్‌, మునిరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️