ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం లేదు

విలేకరులతో మాట్లాడుతున్న మహ్మద్‌ ఇక్బాల్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : ముస్లిం మైనార్టీలంతా టీడీపీకి అండగా ఉన్నారన్న అక్కసుతో వైసీపీ కావాలనే దుష్ప్రచారాలు చేస్తోందని, ముస్లిముల నాలుగు శాతం రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లిదని మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఇక్బాల్‌ తెలియజేశారు. అనంతపురం నగరంలోని టీడీపీ అర్బన్‌ కార్యాలయంలో బుధవారం ఆయన మైనార్టీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్ల పాటు బీజేపీతో అంటకాగి, ఇప్పుడు టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఉన్న 32 కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ఏం చెప్పినా వంతపాడారన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)తో పాటు బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అనేక చట్టాలకు మద్దతు తెలిపిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌ను ముస్లిములు ఎవరూ విశ్వసించవద్దన్నారు. రాష్ట్ర పునర్‌ నిర్మాణం, అభివద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో అవసరమన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని.. ఈ రిజర్వేషన్లు మరింత పటిష్టంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తీసేస్తారంటూ కొంతమంది వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ముస్లిములు నమ్మొద్దన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ముస్లిం రిజర్వేషన్లకు న్యాయస్ధానాల్లో ఉన్న అడ్డంకులరు తొలగిస్తామని హామీ ఇచ్చారు. దుల్హన్‌ పథకం, విదేశీ విద్య వంటి పథకాలకు మించిన పథకాలు వర్తింపజేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌, మాజీ జెడ్పీ ఛైర్మన్‌ చమన్‌ సాబ్‌ తనయుడు డాక్టర్‌ ఉమర్‌, టిడిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫిరోజ్‌, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సైఫుద్దీన్‌, మాజీ ఎంపిపి ఇస్మాయిల్‌, కార్పొరేటర్‌ జనబలం బాబా, ఐఎంఎం బాషా పాల్గొన్నారు.

➡️