జగన్‌రెడ్డిని అధికారం నుంచి దించుతాం

ఉమ్మడి ప్రణాళిక పత్రాన్ని ఆవిష్కరిస్తున్న పెన్షనర్ల సంఘం నాయకులు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌

       అనంతపురం కలెక్టరేట్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక వర్గం ఆగ్రహం ఎలా ఉంటుందో.. జూన్‌ 4వ తేదీ వచ్చే ఫలితాలతో సిఎం జగన్మోహన్‌రెడ్డికి తెలుస్తుందని ఆంధ్రప్రదేశ్‌ పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పెన్షనర్స్‌ పార్టీ చేపట్టిన సుదీర్ఘ యాత్ర బుధవారంతో మగిసింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని డిసెంబర్‌ 17న అనంతపురం నుంచి ప్రారంభమైన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. 4700 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత ఈ యాత్ర అనంతపురంలోనే ముగిసింది. ఈ సందర్భంగా హోటల్‌ మాసినేనిలో ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతలో దగ్గుపాటి ప్రసాద్‌కు తమ మద్దతు ఉంటుందని నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సుబ్బరాయన్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన చంద్రబాబును కాదని, గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించుకున్నందుకు తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సమయానికి పింఛను, ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు అందించారని గుర్తు చేశారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఒకటో తేదీన పింఛను ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. 18వ తేదీ వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. వేతనాలు అందక వద్ధాశ్రమాల్లో ఉండే కొందరు విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారన్నారు. కనీసం ఎన్నికల ముందు కూడా తమ సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీకి, ముఖ్యమంత్రికి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే పెన్షనర్ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకటవ తేదీన జీతాలు, పెన్షన్‌ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

➡️