పోలింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్‌కు అనుమతి లేదు

May 8,2024 23:36

సమీక్షలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా ఎన్నికలాధికారి
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతి ఉండదని, ప్రిసైడింగ్‌ అధికారి, మైక్రో అబ్జర్వ్‌కు మాత్రమే ఫోన్‌కు అనుమతి ఉంటుందని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. ఎన్నికల పరిశీలకులు, కేంద్ర బలగాలు, పోలీస్‌ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు, వివాదాల కారణంగా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా చూడ్డమే ముఖ్యకర్తవ్యమన్నారు. జిల్లాలో జరుగుతున్న కొన్ని ఘర్షణలు, వివాదాలు అప్పటికప్పుడు జరుగుతున్నవేగాని ముందస్తు ప్రణాళికలతో జరిగేవి కాదన్నారు. పెత్తందారీ సామాజిక తరగతులకు చెందినవారు నిమ్న కులాల వారిని పక్కన ఉంచడం వంటి అంశాల్లో ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో 1929 పోలింగ్‌ కేంద్రాలకుగాను 557 కేంద్రాలు సమస్యాత్మకమైనవని, వీటిల్లో మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఓటేసేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాకు 18 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని తెలిపారు. ప్రిసైడింగ్‌ అధికారులకు సెక్టార్‌ అధికారుల ఫోన్‌ నంబర్లు, క్విక్‌ రెస్పాన్స్‌ టీముల ఫోన్‌ నంబర్లు, అవసరమైన వారి ఫోన్‌ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా కరపత్రాలు అందించాలని చెప్పారు. పోలింగ్‌ అధికారి సాయంత్రం 5.55 గం గంటలకు పోలింగ్‌ కేంద్రం నుండి బయటకు వచ్చి 6 గంటలకు గేటును మూసేస్తారని ప్రచారం చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. బందోబస్తుపై జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతోపాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గానికి ఒక స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తుకు 4700 పైగా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్‌ కేంద్రంలోకి పోలీసులు వెళ్లాలంటే ప్రిసైడింగ్‌ అధికారి అనుమతి తప్పనిసరన్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సిబ్బందెవరూ కేంద్రాన్ని వదిలి బయటకు రాకూడదన్నారు. సమీక్షలో సుమిత్‌ కుమార్‌, జార్జ్‌జోసఫ్‌, గౌతమ్‌, బూరె సర్వేశ్వరనరేంద్ర, శ్రీహరి ప్రతాప్‌సాయి, అజిత్‌ సింగ్‌, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు ఎశ్యాం ప్రసాద్‌, రమాకాంత్‌రెడ్డి, సుబ్బారావు, శ్రీరాములు, సరోజినీ, నారద ముని, మురళీకృష్ణ, 18 కంపెనీల కమాండెంట్లు పాల్గొన్నారు.
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో 800 సిసి కెమెరాలు
జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో 800 సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌ కాస్టింగ్‌తో పోలింగ్‌ నిర్వహించాలనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ సదుపాయం ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక కెమెరా పోలింగ్‌ కేంద్రంలో, మరో కెమెరా కేంద్రం వెలుపల ఉండి మొత్తం రికార్డు చేస్తాయని పేర్కొన్నారు. దీనికి అదనంగా మరో దశలో భద్రత ఉంటుందని, సిసి కెమెరాలను కంట్రోల్‌ రూమ్‌ నుండి నిత్యం పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే దగ్గర్లోని క్విక్‌ రెస్పాన్స్‌ టీం లేదా రాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను సంబంధిత ప్రదేశానికి పంపిస్తామని ఎస్పీ తెలిపారు.

➡️