మారుతున్న సమీకరణలు

May 6,2024 00:52

గతనెల మాచర్లలో పలువురు వైసిపిని వీడి టిడిపిలో చేరుతున్న సందర్భం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసిపిలో తీవ్ర గందరగోళం పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు అనేక మంది వైసిపి నుంచి టిడిపిలోకి చేరుతున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందే స్థానిక సంస్థల్లో బలబలాలు మారిపోతున్నాయి. దీంతో రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నాయి. జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టినాతోపాటు ఇప్పటివరకు 8 మంది జెడ్‌పిటిసిలు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. పలువురు ఎంపిపిలుకూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. దీంతో మండల పరిషత్‌లలో కూడా బలబలాలు మారిపోతున్నాయి. అమరావతిలో ఎంపిపి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు కూడా వైసిపిని వీడారు. గుంటూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ సజీలాతోపాటు దాదాపు 8 మంది కార్పొరేటర్లు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. దీంతో కార్పొరేషన్‌లో ఈసారి సమావేశం జరిగితే వైసిపిబలం పూర్తిగా తగ్గిపోయి టిడిపిపై చేయి సాధించే అవకాశం ఉంది. తెనాలి, చిలకలూరిపేటతో పాటు మునిసిపాలిటీలలో కూడా కౌన్సిలర్లు పలువురు వైసిపి నుంచి టిడిపిలో చేరారు. పార్టీకి చెందిన సీనియర్‌ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండంతో ఎన్నికలలో ఆ పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం కన్పిస్తోంది. పల్నాడు జిల్లాలో నర్సరావుపేట సిట్టింగ్‌ ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరడంతోఆయనతో సన్నిహితంగా ఉన్న పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా టిడిపిలో చేరారు. ప్రస్తుతం ఆయన నర్సరావుపేట లోక్‌సభకు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్థానిక సంస్థలలో బలంలేని టిడిపికి ఆయన వల్ల బలం పెరిగింది. అలాగే వైసిపి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరడంతో ఆయనతో పాటు పలువురు ద్వితీయ శ్రేణినాయకులు టిడిపిలో చేరారు. తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి, సమన్వయకర్తలుగా పనిచేసిన డొక్కా మాణిక్య వర ప్రసాద్‌, కత్తెర సురేష్‌ కూడా టిడిపిలో చేరడం వల్ల వారిఅనుచరులుగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు వైసిపికి గుడ్‌బై చెబుతున్నారు.తాజాగా తాడికొండ జెడ్‌పిటిసి టిడిపిలో చేరారు. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ వైసిపికి దూరం అయ్యారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో విబేధాల వల్ల వైసిపిలో రావి వెంకట రమణకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన పార్టీకి దూరం అయ్యారు. ఇటీవల ఆయన టిడిపిలో చేరారు. పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో రావి వెంకట రమణకు బలమైన వర్గం ఉంది. రమణ అనుచులు కూడా అనివార్యంగా టిడిపికి పనిచేస్తున్నారు. గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, ఆయన సోదరుడు, మాజీ డిప్యూటీమేయర్‌ తాడిశెట్టి మురళీ కూడా వైసిపికి గుడ్‌బై చెప్పి టిడిపిలో చేరారు. వారికి అనుకూలంగా ఉన్నకార్పొరేటర్లు, ఎంపిటిసిలు ఇటీవల టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. గుంటూరు తూర్పులో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభానీ, ఆయన కుమార్డు మాజీ డిప్యూటీ మేయర్‌ గౌస్‌ వైసిపి నుంచి టిడిపిలో చేరారు. తాడిశెట్టి సోదరుల ప్రభావంతో ప్రత్తిపాడు, మంగళగిరి, గుంటూరు పశ్చిమలో వైసిపికి కొంత నష్టం ఉంటుందని భావిస్తున్నారు. చిలకలూరిపేటలో సమన్వయకర్తగా ఉన్న మల్లెల రాజేష్‌ నాయుడు టిక్కెట్‌ రాకపోవడం తో వైసిపికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు పలువురు కౌన్సిలర్లు, జెడ్‌పిటిసిని పార్టీలోకి చేర్పించారు. మొత్తంగా ఈపరిణామాలన్నీ అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.

➡️