కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

Dec 16,2023 22:39
కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : అంగన్వాడీల సమ్మెను నీరుగార్చేలా ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడులు వేసినా అదర…. బెదరక.. అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. అంగన్వాడీల సమ్మె శనివారానికి ఐదు రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు ప్రభుత్వ తీరును నిరశిస్తూ సమ్మెను కొనసాగించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో సిడిపివో కార్యాలయం ఎదుట వందలాది మంది తమ న్యాయమైన సమస్యలపై ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేశారు. సమ్మెను నీరుగార్చేలా కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీలు విధులకు హాజరైతున్నట్లు ఐసిడిఎస్‌ అధికారులు వందంతులు సృష్టిస్తున్నారు. ఎన్ని వందంతులు సృష్టించినా ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో లబ్దిదార్ల సంఘీభావంతో సమ్మెను మరింత ఉధృతం చేయనున్నారు. మంత్రి మెప్పుకోసం పీడీ ఓవర్‌ యాక్షన్‌ కేవలం మంత్రి పెంపు కోసం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఐసిడిఎస్‌ చిరుద్యోగులకు అనుకూలంగా ఉండకపోగా ఓవర్‌యాక్షన్‌ చేస్తోంది. ప్రభుత్వం ఒకటి చెబితే పీడీ జిల్లాలో మరోకటి చెబుతోంది. అధికారపార్టీ నేతలను ఉసిగొల్పి సమస్యలను జఠిలం చేస్తూ ప్రభుత్వానికి చెడపేరు తెస్తోంది. పులిచర్ల ప్రాజెక్టు సీడిపివో కావడంతో అక్కడి వర్కర్లను సమ్మెలోకి రాకుండా అడ్డున్నా జిల్లా వ్యాప్తంగా నిరోధించలేకపోయింది. మరోవైపు సమ్మెలో ఉన్న వర్కర్లను బెదిరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా అంగన్వాడీ వర్కర్లను విధులకు హాజరుకావాలంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. పుంగనూరులో అధికారిపార్టీ నేతలను ఉసిగొప్పి సిడిపివో కార్యాలయం ఎదుట వేసిన షామియాను తొలగిస్తూ అధికారికి తొత్తుగా వ్యవహరిస్తోంది. స్వంత నిర్ణయాలతో ఇబ్బందులకు గురి చేస్తోంది. తన శాఖ పరిధిలో అనేక సమస్యలున్నా వాటిని పరిష్కరించకపోగా సమ్మెను నీరుగార్చేందు ప్రయత్నిస్తోంది. పీడి వ్యవహారశైలిపై ట్రేడ్‌ యూనియన్‌ నేతలు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరు: అంగన్వాడీల సమస్యలను పరిష్కారం కోసం 5వ రోజు సమ్మె కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన చర్చలలో ఎలాంటి పురోగతి కనపడకపోవడంతో సమ్మె కొనసాగుతున్నదని రేపట్లోగా వేతనాలు పెంచి సమ్మెను విరమించే విధంగా చేయాలని శనివారం పుంగనూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ సమ్మెలో ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఐదవ రోజు సమ్మెలో కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీలకు సిఐటియు, ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు.నగరి: అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చాలని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నగరిలో జరుగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వంను డిమాండ్‌ చేశారు. అలాగే జనసేన నాయకులు మెరుపుల మహేష్‌, మూస, దేవా, నాగార్జున, గిరి, మోహన్‌, సర్దార్‌, కళ్యాణ్‌, భాస్కర్‌, అబ్దుల్‌, పాల్గొన్నారు.యాదమరి: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం ఐదో రోజు మండల కేంద్రమైన తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి యుటిఎఫ్‌ టీచర్స్‌ యూనియన్‌ తమ మద్దతు ప్రకటించారు. అంగన్వాడీ వర్కర్స్‌ చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలిపి తిరుగు ప్రయాణంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయనకు అంగన్వాడీ వర్కర్స్‌, యుటిఎఫ్‌ యూనియన్‌ నాయకులు సంతాపం తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షురాలు రెహనా బేగం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర, సిఐటియు అధ్యక్షులు చైతన్య, అంగన్వాడీ జిల్లా ఉపాధ్యక్షురాలు షకీలా, యుటిఎఫ్‌ జిల్లా కారదర్శి సురేష్‌, యుటిఎఫ్‌ గౌరవ అధ్యక్షులు శేఖర్‌, అధ్యక్షులు పార్థసారథి, ప్రధాన కార్యదర్శి సర్దార్‌ పాల్గొన్నారు.వెదురుకుప్పం/ కార్వేటినగరం: కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ఐదవ రోజు శనివారం మూడు మండలాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు, వర్కర్లు వారు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మమత మాట్లాడుతూ నెలకు రూ.26వేలు కనీస వేతనం ఇచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె ఆగదని స్పష్టం చేశారు. అనంతరం ఆలయం ఎదుట 101 కొబ్బరికాయలు కొట్టి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తమకు న్యాయం చేసేలా చూడాలంటూ వేడుకున్నారు. నాయకులు ఉమా, విజయ, నాగమ్మ, వల్లి, అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️